Rameshbabu Praggnanandhaa Interview : చెస్ ప్రపంచకప్‌లో ఛాంపియన్‌గా నిలిచే సామర్థ్యం తనకు ఉందని భావిస్తున్నానని భారత యువ సంచలనం, గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద తెలిపాడు. వచ్చే సంవత్సరాల్లో తప్పక గెలుస్తానని విశ్వాసం వ్యక్తం చేశాడు. చెస్ ప్రపంచకప్‌లో రన్నరప్‌గా నిలిచి.. దేశ ప్రజలతో పాటు ప్రధాని ప్రశంసలు సైతం అందుకున్న ప్రజ్ఞానంద.. మంగళవారం నుంచి జరగనున్న టాటా ఇంటర్నేషనల్ చెస్ టోర్నీలో పాల్గొనేందుకు కోల్‌కతాకు వచ్చాడు. ఈ నేపథ్యంలో సోమవారం మీడియాతో కాసేపు ముచ్చటించాడు. ఆ విషయాలు మీకోసం.
మంగళవారం నుంచి జరిగే టాటా ఇంటర్నేషనల్ చెస్ టోర్నమెంట్ గురించి మీ అభిప్రాయం?
నేను ఈ టోర్నీ గురించి పెద్దగా ఆలోచించట్లేదు. మన టీం చాలా చాలా స్ట్రాంగ్‌గా ఉంది. ప్రస్తుతం నేను రిలాక్స్‌గా ఉన్నాను.
ప్రపంచ ఛాంపియన్‌షిప్‌పై మీ ఆలోచనలు ఏంటి?
నేను చెప్పేది ఒక్కటే.. ప్రపంచ ఛాంపియన్ అయ్యేందుకు కావల్సిన నైపుణ్యాలు, సామర్థ్యం నాకు ఉన్నాయి. కొన్నేళ్లలో ప్రంపంచ ఛాంపియన్ అవుతాననే నమ్మకం నాకు ఉంది.
లెజెండరీ ఆటగాడు కార్ల్‌సెన్‌తో పోటీ పడటం మీకు ఎలా అనిపించింది?
ఆన్లైన్ చెస్ అయినా ఆఫ్‌లైన్ చెస్ అయినా కార్ల్‌సెన్ చాలా సమర్థంగా ఆడగలడు. నేను కార్ల్సన్తో ఆడే సమయంలో అతడి నుంచి చాలా నేర్చుకునేందుకు ప్రయత్నించాను. అతడు గత 10 ఏళ్ల నుంచి చెస్‌లో ఆధిపత్యం చెలాయిస్తూ వస్తున్నాడు. పోటీలో కార్లసన్ ఆట తీరును, ఎత్తులను తెలుసుకునేందుకు ప్రయత్నించాను.
మిమ్మల్ని విశ్వనాథన్ ఆనంద్ వారసుడు అంటారు. దానికి మీ సమాధానం?
నేను విశ్వనాథన్ ఆనంద్ గారి అకాడమీలో చాలా రోజుల పాటు ఉన్నాను. ఆ సమయంలో ఆయన నుంచి నేను చాలా నేర్చుకున్నాను. మ్యాచ్‌కు ముందు రోజు డైట్ ప్లాన్ ఎలా ఉండాలి? మ్యాచ్ సమయంలో మానసికంగా, శారీరకంగా బలంగా ఉండేందుకు ఏం చేయాలి? వంటి విషయాలు ఆయనతో చర్చించా.
చెస్ కాకుండా మీరు ఏ ఆటను ఇష్టపడతారు?
చెస్ తరువాత నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. టీమ్ఇండియా మ్యాచ్‌లు అస్సలు మిస్సవ్వను. నాకు ఇష్టమైన ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్.
త్వరలో ఆసియా గేమ్స్ ఉన్నాయి. దానికి భారత జట్టు ఎలా సిద్ధమవుతోంది?
నేను, గుకేశ్, అర్జున్, నిహాల్ టీమ్‌లో ఉన్నాం. మా సన్నద్ధత చాలా బాగుంది.
మీరు కోల్‌కతా ఇష్టపడతారా?
కోల్‌కతా నన్ను బాగా ఆకట్టుకుంది. 2018లో నేను ఇక్కడికి వచ్చినప్పుడు చెస్ ఎంతో కష్టమో నాకు తెలిసింది. టాటా స్టీల్ చెస్ కాంపిటిషన్‌ను దేశంలో చాలా మంచి టోర్నీగా చెప్పవచ్చు.
భవిష్యత్తులో భారతీయ చెస్ రంగంలో మీ పాత్ర ఏంటి?
నేను ఆటతీరు మరింత మెరుగుపరుచుకోవాలని అనుకుంటున్నాను. రాబోయే చెస్ ఆటగాళ్లకు నేను స్ఫూర్తిగా ఉండాలనుకుంటున్నా.
కెరీర్లో మీ తల్లి పాత్ర ఏంటి?
నేను ఎక్కడికి వెళ్లినా మా అమ్మ ఇండక్షన్ ఒవెన్ తీసుకుని వస్తుంది. ఆమె చాలా రకాల వంటకాలు చేస్తుంది. నేను బాగా ఆడుతున్నానా? లేదా అనేది నా ముఖం చూస్తే మా అమ్మకు తెలిసిపోతుంది.
ఏకాగ్రత కోసం మీరేం చేస్తారు?
నేను రోజు యోగా, ధ్యానం చేస్తాను. వీడియో గేమ్స్ అసలు ఆడను. వీడియో గేమ్స్‌తో చాలా సమస్యలు ఎదురువుతాయి. మంచి సినిమాలు చూస్తాను. భారతీయ వంటకాలను బాగా ఇష్టపడతాను.
ప్రధాని మోదీని కలవడం ఎలా అనిపించింది?
ఆయన నాతో చాలా బాగా మాట్లాడారు. నా శిక్షణ గురించి అడిగి తెలుసుకున్నారు. మా అమ్మనాన్నలతోనూ మాట్లాడారు.
Praggnanandhaa Next Tournament : 'విరామం లేదు.. విశ్రాంతి లేదు.. అయినా సోమవారం కొత్త పోరాటం'