కర్ణాటక మాజీ మంత్రి, భాజపా ఎమ్మెల్యే రమేశ్ జార్కిహోళి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఇటీవల జరిగిన భాజపా మహాసభలో రమేశ్ జార్కిహోళి.. కాంగ్రెస్ ఎమ్మెల్యే లక్ష్మీ హెబ్బాల్కర్‌పై పరోక్షంగా తీవ్ర విమర్శలు చేశారు. 'ఎన్నికల సమయంలో హెబ్బాల్కర్ ఇచ్చిన అన్ని వస్తువులు కలిపితే రూ.మూడు వేలు అవుతుంది. నేను రూ.ఆరు వేలు ఇస్తా. ఓటు వేయండి' అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ఆ రాష్ట్రంలో వివాదాస్పదమయ్యాయి.
జార్కిహోళి ఏమన్నారంటే?
ఎమ్మెల్యే లక్ష్మీ హెబ్బాల్కర్ నియోజకవర్గంలోని సుళేబావిలో ఇటీవల జరిగిన భాజపా మహాసభలో రమేశ్ జార్కిహోళి పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యే.. గ్రామాలలో కుక్కర్లు, మిక్సర్లు పంచి పెట్టారని విమర్శించారు. 'ఒక మిక్సర్ ధర రూ.600 నుంచి రూ.700 ఉండవచ్చు. అలాగే మరికొన్ని వస్తువులు కూడా ఇస్తారు. వస్తువుల ధరలన్నీ కలిపితే మూడు వేల రూపాయలు కావొచ్చు. ఓటుకు రూ.మూడు వేలు ఇచ్చి ఆమె గెలిచారు. మేము ఓటుకు రూ.6000 ఇస్తాం.. మాకు ఓటు వేయండి' అని సభలో మాట్లాడారు. అదేసమయంలో, తాను ఆరు ఎన్నికల్లో గెలిచానని, కానీ ఏ ఎన్నికలోనూ డబ్బులు, వస్తువులు పంచలేదని చెప్పుకొచ్చారు. తన నియోజకవర్గ ప్రజలే తనకు డబ్బులిచ్చి గెలిపించారని జార్కిహోళి అన్నారు.
లక్ష్మీ హెబ్బాల్కర్ స్పందన:
రమేశ్ వ్యాఖ్యలపై లక్ష్మీ హెబ్బాల్కర్ ఘాటుగా స్పందించారు. ఆదివారం బెళగావిలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. రమేశ్ చేసిన అనుచిత వాఖ్యలపై మండిపడ్డారు. తన నియోజకవర్గంలోకి వచ్చిన భాజపా ఎమ్మెల్యే.. ఓటర్లకు డబ్బులు పంచుతామని చెప్పడం మూర్ఖత్వమని, ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని చెప్పుకొచ్చారు. రమేశ్ చేసిన వ్యాఖ్యలను రాష్ట్రంలోని ఎన్నికల అధికారులు, ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు నళిన్ కుమార్ కటీల్ గమనిస్తున్నారని, జార్కిహోళి చేసిన వ్యాఖ్యలను వారికే వదిలేస్తున్నాని పేర్కొన్నారు.
"నా నియోజకవర్గ ప్రజలు ఆత్మగౌరవం ఉన్నవాళ్లు. వారు నన్ను తమ ఇంటి సొంత బిడ్డగా స్వీకరించారు. నియోజకవర్గ అభివృద్ధికై నేను చేస్తున్న కృషికి వారు నన్ను మెచ్చుకుంటున్నారు. వారు ఎలాంటి ప్రలోభాలకు లొంగరు. రూ.6 వేలు పెట్టి ఓట్లు తెచ్చుకోవాలనుకుంటే.. అది వారి మూర్ఖత్వానికి పరాకాష్ఠ."
-లక్ష్మీ హెబ్బాల్కర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే
మరోవైపు, మాజీ మంత్రి రమేశ్ జార్కిహోళి చేసిన ప్రకటనపై భాజపా నాయకుడు, జలవనరుల శాఖ మంత్రి గోవింద్ కారజోల స్పందించారు. రమేశ్ జార్కిహోళి చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగత అభిప్రాయమని చెప్పారు. భాజపాలో అలాంటి వ్యవస్థ లేదని, పార్టీకి సిద్ధాంతాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు.