Drinking Contaminated Water: రాజస్థాన్ కరౌలి జిల్లాలోని సిమారా గ్రామంలో 119 మంది గ్రామస్థులు.. కలుషిత నీటిని తాగి అస్వస్థతకు గురయ్యారు. గురువారం గ్రామంలో ఉన్న బావిలోని నీటిని తాగిన కాసేపటికే అందరికీ వాంతులు, విరేచనాలు అయ్యాయి. వెంటనే వారందిరినీ స్థానిక ఆసుపత్రిలో చేర్చారు అధికారులు. అస్వస్థతకు గురైన వారిలో 43 మంది మహిళలు, 37 మంది పురుషులు, 39 మంది చిన్నారులు ఉన్నారు. దీంతో ఆ ఆసుపత్రిలో పడకల కొరత ఏర్పడింది. ఒకే మంచంపై ఆరుగురు చిన్నారులు చికిత్స పొందాల్సిన పరిస్థితి వచ్చింది.
వందల మంది గ్రామస్థులు అస్వస్థతకు గురయ్యారనే సమాచారంతో వైద్యబృందం గ్రామానికి చేరుకుని బావిని పరిశీలించగా.. అందులో పురుగులు కనిపించాయి. దీంతో బావిలోని మురికి నీటిని ఎవ్వరూ తాగవద్దని ఆరోగ్యశాఖ అధికారులు గ్రామస్థులకు సూచించారు. పరీక్షల కోసం నీటి నమూనాలు కూడా తీసుకున్నారు. గ్రామంలో ఉన్న బావులన్నింటిలో బ్లీచింగ్ పౌడర్ వేశారు. ప్రస్తుతం గ్రామంలో నీటి సరఫరా కోసం ట్యాంకర్లను అందుబాటులో ఉంచారు.
ఇద్దరు మృతి, 30 మందికి అస్వస్థత.. మధ్యప్రదేశ్ నర్సింగ్పుర్ జిల్లాలో చాంద్పుర్ గ్రామంలో కలుషిత నీరు తాగి ఇద్దరు గ్రామస్థులు మరణించారు. సుమారు 30 మంది గ్రామస్థులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే అధికారులు అప్రమత్తమై గ్రామానికి వైద్యుల బృందాన్ని పంపించారు. అనారోగ్యం బారిన పడిన వారికి చికిత్స అందిస్తున్నారు.
ఇవీ చదవండి: కరెంట్ కోతలకు రోగి బలి.. ఇంట్లో వెంటిలేటర్ పనిచేయక!