Rahul Congress President: కాంగ్రెస్ కొత్త జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు పార్టీపరంగా ఏర్పాట్లు పూర్తవుతున్నా దానిని చేపట్టేందుకు అగ్రనేత రాహుల్‌గాంధీ ఈసారి ముందుకు వస్తారా లేదా అనేది చర్చనీయాంశమైంది. ఈనెల 21 నుంచి సెప్టెంబరు 20 మధ్య పార్టీ సారధి ఎన్నిక పూర్తవుతుందని కాంగ్రెస్ ఇప్పటికే ప్రకటించింది. ఎన్నికల్లో ఓటేసే వారి జాబితాను తాము సిద్ధం చేశామని, ఎన్నికల తేదీని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) ప్రకటించాల్సి ఉందని కాంగ్రెస్ ఎన్నికల విభాగం అధ్యక్షుడు మధుసూదన్ మిస్త్రీ తెలిపారు.
లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ వరుసగా రెండుసార్లు ఓటమి చెందాక పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్‌గాంధీ 2019లో రాజీనామా చేశారు. నేతల ఒత్తిడితో ఆ బాధ్యతను సోనియాగాంధీ మరోసారి స్వీకరించారు. మధ్యలో సీనియర్ నేతలు అసమ్మతి గళం వినిపించినప్పుడు రాజీనామా చేసేందుకు ఆమె సిద్ధపడినా సీడబ్ల్యూసీ విన్నపం మేరకు కొనసాగుతున్నారు. పార్టీలో అత్యధికులు రాహుల్‌నే మరోసారి అధ్యక్షుడిగా కోరుకుంటున్నారని, మునుపటి నిర్ణయాన్ని మార్చుకుంటున్నట్లుగా ఆయన నుంచి ఎలాంటి సంకేతాలు రావట్లేదని సీనియర్ నాయకుడొకరు తెలిపారు.
సోనియాకు సహాయంగా కార్యనిర్వాహక అధ్యక్షులు!
రాహుల్ కాకపోతే సోనియా గాంధీనే అధ్యక్ష పదవిలో కొనసాగాలని మరికొందరు కోరుతున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా పార్టీ రోజువారీ కార్యకలాపాల్లో సహాయం చేయడానికి కార్యనిర్వాహక అధ్యక్షుల హోదాతో ఒకరిద్దరు సీనియర్ నాయకులకు బాధ్యత అప్పగించాలని వారు సూచిస్తున్నారు. దేశంలో ప్రతిపక్షాలపై కక్షసాధింపు చర్యలు కొనసాగుతున్నాయని, ఇలాంటి తరుణంలో సోనియా, రాహుల్‌లలో ఎవరో ఒకరు అధ్యక్ష పదవిలో కొనసాగితే వారిని ఇరుకున పెట్టడం అధికార పార్టీకి కష్టమవుతుందని వారు అంటున్నారు.
ఇవీ చదవండి: సిసోదియా మనిషికి రూ.కోటి లంచం, ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీబీఐ
ప్రభుత్వ సమావేశాల్లో లాలూ అల్లుడు, మంత్రి తేజ్ ప్రతాప్ పక్కనే కూర్చొని సమీక్ష