ఇప్పటి వరకు మీరు చాలా రకాల పెళ్లిళ్లు చూసి ఉంటారు.. ఒకరు సముద్రంలో పెళ్లి చేసుకుంటే, మరొకరు గాల్లో వివాహం చేసుకుంటారు.. కానీ ఈ పెళ్లి మాత్రం కాస్త స్పెషల్. ఎందుకంటే అశుభానికి సూచకంగా చూసే శ్మశానంలో శుభకార్యమైన పెళ్లిని జరిపించారు పంజాబ్లోని ఓ గ్రామ ప్రజలు.
పంజాబ్ రాష్ట్రంలో ఓ వింత వివాహం జరిగింది. ఒక పేద అమ్మాయికి తమ సొంత ఖర్చులతో శవాలను దహనం చేసే శ్మశానవాటికలో పెళ్లి జరిపించారు అమృత్సర్ జిల్లాలోని మోహకాంపుర గ్రామస్థులు. దీంట్లో ప్రత్యేకమేముంది అంటారా? ఈ గ్రామంలో చాలా కాలంగా ఓ వృద్ధురాలు తన మనవరాలితో కలిసి శ్మశానవాటికలో జీవిస్తోంది. వారి నిజాయితీ, ఆప్యాయతల కారణంగా ఇద్దరూ ఇక్కడి ప్రజల మనసుల్లో నిలిచిపోయారు.
ఈ క్రమంలో అమ్మాయి పెళ్లి వయస్సుకు రావడం వల్ల ఆ ప్రాంత వాసులే సంబంధం చూసి మరీ వివాహం జరిపించారు. విశేషమేంటంటే శ్మశానంలో నివసించే అమ్మాయికి పెళ్లి చేయించడమే కాకుండా బరాత్ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసి అక్కడి వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. "శ్మశానం లోపల ఓ చిన్నగదిలో వృద్ధురాలు, అమ్మాయి ఉంటున్నారు. ఎంతో ప్రేమ, ఆప్యాయతలతో వీరు ఉండేవారు. అటువంటి కుటుంబంలోని ఆడబిడ్డకు వివాహం జరిపించడం మాకెంతో గర్వంగా ఉంది" అని ఇక్కడి స్థానికులు చెబుతున్నారు. ఈ దహన వాటికలపై కొందరికి భిన్నాభిప్రాయాలున్నాయని.. అయితే ఈ గ్రామంలోని ప్రతి ఒక్కరూ ఇలానే వివాహం చేసుకుంటారని గ్రామస్థులు తెలిపారు.
ఊరి పెద్దల సహకారంతో తన మనవరాలు మెట్టినింటికి వెళ్తోందని సంతోషం వ్యక్తం చేసింది వధువు అమ్మమ్మ ప్రకాశ్ కౌర్. అందరికీ కృతజ్ఞతలు చెప్పారు.
ఇవీ చదవండి: