Protest abroad against Chandrababu's arrest : తెలుగుదేశం అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుపై విదేశాల్లో నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. అమెరికా నుంచి ఆస్ట్రేలియా వరకు తెలుగు ప్రజలున్న ప్రతి చోటా... ఆందోళనలు మిన్నంటుతున్నాయి. ‘వియ్ ఆర్ విత్ సీబీఎన్ ’ అంటూ చంద్రబాబుకు మద్దతుగా తెలుగు ప్రజలు, తెలుగుదేశం సానుభూతిపరులు కదంతొక్కారు. భారీ ప్రదర్శనలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నల్ల దస్తులు ధరించి నిరసనలో పాల్గొన్నారు. ‘న్యాయం కావాలి... చంద్రబాబు విడుదల కావాలంటూ... నినాదాలతో హోరెత్తించారు. పలు చోట్ల తెలుగుదేశం శ్రేణులు చేపట్టిన నిరసనలకు జనసేన కార్యకర్తలు సంఘీభావం ప్రకటించారు. చంద్రబాబుకు మద్దతుగా అమెరికాలోని డల్లాస్ నగరంలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. వేల మంది తెలుగు ప్రజలు బయటికి వచ్చి వీధుల్లో ర్యాలీ చేశారు. జాతీయ జెండాలు, ప్లకార్డులు చేతపట్టి నిరసన తెలిపారు. అనంతరం మానవహారం నిర్వహించారు. వాషింగ్టన్‌లో అమెరికా పార్లమెంట్ సాక్షిగా తెలుగుదేశం శ్రేణులు నిరసన తెలిపాయి. ఎన్‌ఆర్‌ఐ తెలుగుదేశం ఆధ్వర్యంలో చంద్రబాబు మద్దతుగా ఆందోళన చేశారు. ఆయన అరెస్ట్ అక్రమమంటూ జయరాం కోమటి, సతీష్ వేమన మండిపడ్డారు. వాషింగ్టన్ నగరానికి చుట్టుపక్కల నగరాల నుంచి వందల మంది ప్రవాసాంధ్రులు తరలివచ్చి మద్దతు పలికారు. ‘బాబుతో నేను ’ అనే ప్లకార్డులు ప్రదర్శించారు. మానవహారం నిర్వహించారు.
అమెరికాలోని కాలిఫోర్నియా బే ఏరియాలో భారీ ఎత్తున తెలుగు ప్రజలు... నిరసన తెలిపారు. చుట్టుపక్కల నగరాల నుంచి తరలివచ్చిన మహిళలు, చిన్నారులు సైతం.. భారీ ర్యాలీ నిర్వహించారు. తెలుగుదేశం, జనసేన మద్దతుదారులు సైతం ఆందోళనలో పాల్గొన్నారు. ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. అభివృద్ధికి బాటలు వేసిన దార్శనికుడిని కక్షపూరితంగా అరెస్టు చేశారంటూ... ఆవేదన వ్యక్తంచేశారు. అన్ని కష్టాలను దాటుకుని చంద్రబాబు త్వరగా బయటికి వస్తారని ఆకాంక్షించారు.
ఫిలడేన్ఫియాలో భారీ కార్ల ర్యాలీ నిర్వహించారు. మహిళలు, యువతులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అమెరికాలోని సెయింట్‌లూయిస్, హార్ట్‌పోర్ట్, టెక్సాస్‌లోని ఫ్రిక్సోతోపాటు ఇతర నగరాల్లోనూ నిరసనలు చేపట్టారు. లండన్‌లో తెలుగు ప్రజలు భారీ ప్రదర్శన నిర్వహించారు. నల్లటి దుస్తులతో తరలివచ్చిన మహిళలు, చిన్నారులు... చంద్రబాబుకి మద్దతుగా నినాదాలతో హోరెత్తించారు. అక్రమంగా అరెస్టు చేసిన చంద్రబాబును విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ను ఖండిస్తూ అస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో తెలుగు ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. తెలుగుదేశం, జనసేన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పసుపు జెండాలు, జనసేన జెండాలతో నినాదాలు చేశారు. సిడ్నీ నగరంలోని ఓపేరా హౌస్, బ్రిస్బేన్‌లో కూడా నిరసన తెలిపారు.
మలేషియాలోని తెలుగు ప్రజలు సైతం చంద్రబాబుకు బాసటగా నిలిచారు. స్వచ్ఛందంగా బయటికి వచ్చి ఆయన అక్రమ అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ నిరసన తెలిపారు. ఎన్నో సంక్షోభాలను దాటి ప్రజా సంక్షేమాన్ని చేసిన నాయకుడు చంద్రబాబు అని కొనియాడారు.
ఎన్‌ఆర్‌ఐ తెలుగుదేశం ఆధ్వర్యంలో దక్షిణాఫ్రికాలోని మాడ్రిన్డ్‌లో ప్రవాసాంధ్రులు నిరసన తెలిపారు. టాంజానియాలో మహిళలు పసుపు దుస్తులు ధరించి నిరసన ర్యాలీ నిర్వహించారు. తెలుగుదేశం జెండాలు చేతపట్టి చంద్రబాబుకు మద్దతుగా నినాదాలు చేశారు.
సౌదీ అరేబియాలోని ఆల్ కోభార్‌లో పార్టీ జెండాలతో తెలుగు ప్రజలు నిరసన తెలిపాయి. భారీ ర్యాలీ నిర్వహించారు. సీఎం జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దుబాయ్‌లోని జాబెల్ ఆలీ హిందూ దేవాలయం ప్రత్యేక పూజలు చేశారు. సమీపంలో నిరసన దీక్ష చేపట్టారు. ఎన్‌ఆర్‌ఐ తెలుగుదేశం విభాగం ఆధ్వర్యంలో బెల్జియంలో మేము సైతం బాబుతోనే కార్యక్రమాన్ని నిర్వహించారు. జనసేన నాయకులు పాల్గొని సంఘీభావం ప్రకటించారు.