Hindus honoured muslim funeral : కర్ణాటకలో మత సామరస్యం వెల్లివిరిసింది. రాణేబెన్నూర్లోని ఉమాశంకర్ వీధిలో గణేశ్ నిమజ్జనం కోసం ఆ ప్రాంత యూత్ కౌన్సిల్ వినాయకుడిని ఊరేగింపుగా తీసుకుని వెళ్తున్నారు. జన సందోహంతో, డీజే పాటలతో ఆ వీధి అంతా సండదిగా మారింది. ఎంజీ రోడ్డుకు వాహనం సమీపిస్తున్న సమయంలో అదే దారిలో ఓ ముస్లిం వ్యక్తి అంతిమయాత్ర జరుగుతోంది. ఇది గమనించిన కమిటీ సభ్యులు.. ముస్లిం అంతిమ యాత్రను దృష్టిలో పెట్టుకొని వ్యవహరించిన తీరు ప్రశంసలు అందుకుంటోంది. అప్పటివరకు డీజే పాటలకు డ్యాన్స్ చేస్తున్న భక్తులంతా.. ముస్లిం భౌతికకాయం వెళ్లిపోయేంత వరకు.. డీజే పాటలను నిలిపివేశారు. పార్థివదేహం ఆ వీధి దాటేంత వరకు డీజే పాటలు ఆపి ఆ తర్వాత మళ్లీ కొనసాగించారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న వారంతా వీరు చేసిన పనికి అభినందిస్తున్నారు.
ఐక్యతకు అద్దంపట్టే మరో ఘటన
హిందూ, ముస్లింల ఐక్యతకు అద్దంపట్టే మరో ఘటన హుబ్లీలోని గొందునాసీ గ్రామంలో చోటు చేసుకుంది. హిందు ముస్లిం భాయిభాయి అనే మాటకు నిదర్శనంగా నిలిచారు హుబ్లీ తాలూకా కోటగొందునాసి గ్రామ ప్రజలు. గణేశ్ ఉత్సవాలలో ముస్లింలు సైతం పాల్గొన్నారు. ముస్లింల పండుగలను హిందువులు అలాగే హిందువుల పండుగలను ముస్లింలు జరుపుకోవడం ఇక్కడ సర్వసాధారణం.
ఏటా జరిగే గణేశ్ ఉత్సవాల్లో ఇక్కడి ముస్లింలు వినాయకునికి పూజలు నిర్వహిస్తారు. గణేశుడి విగ్రహం ముందు నమాజ్ చదువుతారు. అక్కడ జరిగే ఇతర ఉత్సవాల్లో సైతం ముస్లింలు పాల్గొంటారు. అలాగే ఇక్కడి హిందువులు వారి పండుగకు ఇఫ్తార్ విందును ఇస్తుంటారు. గత 25 ఏళ్లుగా తాము ఇలాగే కలిసిమెలిసి పండగలు నిర్వహించుకుంటున్నామని గ్రామస్థులు తెలిపారు.
ఇదీ చదవండి: ఇస్రో కోసం రాకెట్ల తయారీ.. రూ.860 కోట్ల కాంట్రాక్టు ఎవరికి దక్కిందంటే?
పాత బైక్‌లపై ఎమ్మెల్యే ఆసక్తి.. 70 ఏళ్ల క్రితం నాటి వాహనాలు భద్రంగా..