గర్భిణీని డోలి కట్టి భుజాలపై మోసుకుళ్లిన ఘటన కర్ణాటకలోని చామరాజనగర్ సమీపంలోని అటవీ ప్రాంతంలో జరిగింది. డోలిపైనే 8 కిలోమీటర్లు గర్భిణీ ఉంచి ఆసుపత్రికి తీసుకెళ్లారు. అర్ధరాత్రి ఒంటి గంటకు ప్రయాణం మొదలు పెట్టి ఉదయం ఆరు గంటలకు ఆసుపత్రికి చేరుకున్నారు. రవాణా సౌకర్యాలు అందుబాటులో లేకపోవడం వల్ల ఇలా చేయాల్సి వచ్చిందని గ్రామస్థులు తెలిపారు.
అసలేం జరిగిందంటే: చామరాజనగర్లోని మలై మహదేశ్వర అటవీ ప్రాంతంలోని దొద్వాణి గ్రామానికి చెందిన శాంతలకు పురిటి నొప్పులు వచ్చాయి. ప్రసవం గడువు కంటే ముందే ఆమెకు నొప్పులు మొదలయ్యాయి. ఆ గ్రామంలో ఎవరికీ వాహనాలు లేవు. ఏం చేయాలో అర్థంకాని కుటుంబ సభ్యులు.. గ్రామస్థుల సాయంతో డోలీ కట్టారు. అందులోనే శాంతలను మోసుకెళ్లారు. పులులు, అడవి పందులు, చిరుతలు వంటి జంతువులు ఆ అరణ్యంలో ఎక్కువగా ఉంటాయి. వాటిని సైతం లెక్కచేయకుండా అర్ధరాత్రి ప్రయాణాన్ని కొనసాగించారు. వైద్యులు.. శాంతలకు సురక్షిత ప్రసవం చేశారు.
'జన-మన' అనే పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొన్నాళ్ల క్రితం ప్రారంభించింది. అటవీ ప్రాంతంలో ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు కనీసం 8 నుంచి 10 కి.మీ దూరం నడిచే గ్రామస్థులు ఉపయోగించుకునేందుకు 5 జీపులను అందుబాటులో ఉంచింది. అయితే సిగ్నల్ సరిగ్గా లేని కారణంగా గిరిజనులు ఫోన్ చేయలేకపోతున్నారని అధికారులు తెలిపారు.
ఇవీ చదవండి: యువతుల మధ్య లవ్.. పెళ్లైందని తెలిసి చితకబాదిన బంధువులు