Pregnant Teacher Murder: ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో విషాద ఘటన జరిగింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న ఐదు నెలల గర్భిణీను కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు దుండగులు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. బాధితురాలిని అయోధ్యకు చెందిన ఉపాధ్యాయురాలు సుప్రియ శర్మగా గుర్తించారు.
పోలీసుల వివరాల ప్రకారం.. అయోధ్యలో కొత్వాలి ప్రాంతంలోని శ్రీరామ్‌పుర్ కాలనీలో బాధితురాలు సుప్రియ శర్మ తన కుటుంబంతో నివసిస్తోంది. ఆమె స్థానిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వర్తిస్తోంది. సుప్రియ భర్త ఉమానాథ్ శర్మ కూడా ఉపాధ్యాయుడే. అయితే బుధవారం ఉమానాథ్ శర్మ తన అత్తతో బ్యాంకుకు వెళ్లాడు. ఆ సమయంలో బాధితురాలు ఇంట్లో ఒంటరిగా ఉంది. బాధితురాలి భర్త బ్యాంకు నుంచి తిరిగి వచ్చేసరికి.. సుప్రియ రక్తపుమడుగుల్లో పడి ఉంది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా.. మరణించిందని వైద్యులు తెలిపారు. దీంతో అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేశారు. హత్య చేసిన వారికోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. బాధితురాలి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసిన సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్.. రాష్ట్రంలో మహిళల భద్రత గురించి ట్వీట్ చేశారు. నగరంలో ప్రతి కూడలిలో పోలీసు బలగాలను మోహరించినప్పుడు ఈ దారుణ ఘటన ఎందుకు జరిగిందని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఉపాధ్యాయులు.. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు నేరస్థులకు లక్ష్యంగా మారారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు, ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బుధవారం అయోధ్యలో రామమందిర గర్భగుడి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అదే అయోధ్యలో టీచర్ హత్య జరగడం గమనార్హం.
ఇవీ చదవండి: గొడవపడి భార్య ముక్కు కొరికిన భర్త