ప్రకృతి అందాలకు నెలవైన కశ్మీర్‌కు పర్యటకుల తాకిడి అధికంగా ఉంటుంది. సాధారణం కంటే శరద్ కాలంలో ఈ ప్రాంతానికి వచ్చే వారి సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుంది. కశ్మీర్ అందాలకు ముగ్ధులయ్యే పర్యటకులు ప్రత్యేక ఫొటో షూట్ల కోసం తరలివస్తున్నారు. పచ్చని ఆకులతో హరిత వర్ణంలో కనిపించే కశ్మీర్.. ఈ కాలంలో ఆకులు రాలుతూ గోధుమ వర్ణంలో దర్శనమిస్తుంది. దీంతో ఆ సోయగాన్ని తిలకించేందుకు దేశం నలమూలల నుంచి పకృతి ప్రేమికులు ఇక్కడికి చేరుకుంటున్నారు.
ముఖ్యంగా మన సినిమాల్లో చూపించే కశ్మీర్ అందాలను చూసిన అభిమానులు.. దాన్ని రియల్ లైఫ్‌లోనూ చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఆ సినిమాలను ఆదర్శంగా తీసుకుని మరి ప్రీ వెడ్డింగ్ ఫొటో షూట్ల కోసం వస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చి మరి మధుర క్షణాలను కెమెరాల్లో బంధిస్తున్నారు. అంతే కాకుండా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, వ్లాగర్లు, అలాగే బ్రాండ్ మార్కెటర్లు ఈ ప్రకృతి అందాలను తమ వీక్షకులకు చూపించేందుకు పర్యటిస్తున్నారు. కశ్మీర్‌లోని ప్రముఖ ప్రాంతాలైన నిషాత్ బాఘ్ అలాగే దాచిగామ్ నేషనల్ పార్క్‌లకు వచ్చే సందర్శకులు అక్కడే తమ ఫొటో షూట్లను నిర్వహించేందుకు ఇష్టపడుతున్నారు.
ఈ ఏడాది మొత్తం వచ్చిన సందర్శకుల సంఖ్య 1.62 కోట్లకు చేరుకుందని శ్రీనగర్ పరిపాలన సీనియర్ అధికారి తెలిపారు. గత నెలలో ఈ ప్రాంతాలన్నీ భారీ జనసందోహంతో నిండిపోయారని.. ముఖ్యంగా మొఘల్ గార్డెన్స్‌లో ప్రతిరోజూ అనేక ప్రీ వెడ్డింగ్ షూట్లు జరుగుతాయన్నారు. శరద్ రుతువులో తమ ఉత్పత్తుల కోసం ప్రచార వీడియోలతో పాటు ఫోటోలను చిత్రీకరించడానికి పెద్ద బ్రాండ్‌లు ఇక్కడికి వస్తుంటాయని అధికారులు పేర్కొన్నారు.
ఇదీ చదవండి:పెళ్లిచూపుల జాతర.. 250 మంది అమ్మాయిల కోసం 11వేల మంది యువకుల పోటీ
ఒకేసారి రెండు చేతులతో రాస్తూ.. ఐదారు భాషల్లో స్పీచ్ దంచికొట్టే సూపర్‌కిడ్స్