Gaddar Passed Away : ప్రజా గాయకుడు గద్దర్ ఇకలేరు. గుండె సంబంధిత అనారోగ్యంతో.. అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. గుండె శస్త్ర చికిత్స అనంతరం ఇన్ఫెక్షన్ ఎక్కువై ఆరోగ్యం విషమించి చనిపోయారని వైద్యులు తెలిపారు. గద్దర్ మృతిపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం తెలిపారు. తెలంగాణ పాటకు ప్రపంచ ఖ్యాతి తెచ్చిన ప్రజాగాయకుడు అని.. తన పాటతో పల్లెపల్లెనా తెలంగాణ భావజాలం వ్యాప్తి చేశారని పేర్కొన్నారు. తన ఆటపాటలతో ప్రజల్లో స్వరాష్ట్ర చైతన్యం రగిలించారని వివరించారు. గద్దర్ మరణంతో తెలంగాణ గొప్ప ప్రజాకవిని కోల్పోయిందని కేసీఆర్ అన్నారు.
ఆపోలో ఆసుపత్రిలో గద్దర్ భౌతికకాయాన్ని రేవంత్‌రెడ్డి, వీహెచ్, సీతక్క, గోరటివెంకన్న, విమలక్క సందర్శించారు. ఆయన పార్థివదేహాన్ని చూసి విమలక్క కన్నీటిపర్యంతమయ్యారు. ఆసుపత్రి నుంచి గద్దర్ పార్థివదేహాన్ని.. ఎల్బీస్టేడియానికి తరలించారు. సోమవారం ఉదయం వరకు ప్రజల సందర్శనార్థం అక్కడే ఉంచనున్నారు. అనంతరం మధ్యాహ్నాం ఆయన నెలకొల్పిన అల్వాల్‌లోని మహాబోధి పాఠశాల ఆవరణలో.. ప్రభుత్వ లాంఛనాలతో గద్దర్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
గద్దర్ అసలు పేరు గుమ్మడి విఠల్‌రావు. మెదక్ జిల్లాలోని తూప్రాన్ గ్రామంలో లచ్చమ్మ, శేషయ్య దంపతులకు 1949లో జన్మించారు. నిజామాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాలో చదువుకున్నారు. ఆయన హైదరాబాద్‌లో ఇంజినీరింగ్ చదివారు. 1969 తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ప్రత్యేక తెలంగాణ ఎందుకు కావాలో చెబుతూ.. ఊరురా తిరిగి ప్రచారం చేశారు. సామాన్యులకు కూడా అర్థమయ్యే రీతిలో బుర్రకథ వేదికగా ఎంచుకుని పాటలు పాడారు. దర్శకుడు బి.నరసింగరావు ప్రోత్సాహంతో 1971లో సినిమాల్లో తొలి పాట పాడారు. "ఆపార రిక్షా" రాశాడు. ఆయన తొలి ఆల్బం పేరు గద్దర్. ఇదే ఆయన పేరుగా స్థిరపడింది. తన పాటలతో తాడిత పీడిత, బడుగు బలహీన వర్గాలను మేల్కొలిపారు.
వెయ్యి డప్పులు, లక్ష గొంతులు: గద్దర్
Gaddar Latest News : మాభూమి సినిమాలో సాయుధ పోరాట యోధుడు యాదగిరి పాత్రలో గద్దర్ నటించారు. బండెనక బండి కట్టి అంటూ ఆడిపాడారు. తెలుగు ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించారు. 1984లో బ్యాంకు ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తిస్తాయిలో.. ప్రజగాయకుడిగా ప్రస్థానం ప్రారంభించారు. కారంచేడులో దళితుల హత్యలకు వ్యతిరేకంగా పోరాడారు. జన నాట్య మండలిలో చేరి.. ఒగ్గు కథ, బుర్ర కథ, ఎల్లమ్మ కథల ద్వారా గ్రామీణ ప్రజల్లోకి వెళ్లారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, బిహార్‌లోనూ ప్రదర్శనలు ఇచ్చారు.
స్టీల్ ప్లాంట్ కార్మికుల ఉద్యమం వర్ధిల్లాలి: గద్దర్
గద్దర్ గోచి, గొంగడి మాత్రమే ధరించే వారు. దళితులు, పేదలు అనుభవిస్తున్న కష్టాలను పాటలు, నాటకాల రూపంలో తెలియజెప్పేవారు. ఆయన పాటలు క్యాసెట్లు, సీడీలు భారీగా అమ్ముడుపోయాయి. 1997 ఏప్రిల్ 6న గద్దర్‌పై హత్యాయత్నం జరిగింది. ఆయన శరీరంలోకి అనేక బుల్లెట్లు దూసుకెళ్లాయి. అన్ని బుల్లెట్‌లను తొలగించినా.. ఒక తూటాను మాత్రం తొలగించలేదు. ఆ బుల్లెట్‌ను తొలగిస్తే ప్రాణాలకే ప్రమాదమని వదిలేశారు. చనిపోయే వరకు ఒంట్లో బుల్లెట్‌తోనే గద్దర్ జీవించారు.
కంటోన్మెంట్లో పేదల ఇళ్లను కాపాడండి: గద్దర్
Folk Singer Gaddar Passed Away : మలిదశ తెలంగాణ ఉద్యమంలోనూ గద్దర్ కీలక పాత్ర పోషించారు. తొలి నుంచి తెలంగాణవాదిగా ఉన్న ఆయన.. ప్రత్యేక రాష్ట్రం ఎందుకు అవసరమో ఎప్పుడూ చెబుతుండేవారు. గద్దర్ రాసిన "అమ్మ తెలంగాణమా... ఆకలి కేకల గానమా" పాట... ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో మారుమోగని ఊరు లేదు. స్ఫూర్తిపొందని ఉద్యమకారుడు లేడు. జై బోలే తెలంగాణ సినిమాలో 'పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలామా అంటూ.. మరోసారి తెలంగాణ గుండెల్ని తట్టి లేపారు. ఈ పాట అద్భుత విజయం సాధించింది.
సినిమాల్లో గద్దర్ రాసిన "నీ పాదం మీద పుట్టు మచ్చనై చెల్లెమ్మ" అనే పాటకు ఉత్తమ గీతంగా నంది అవార్డు వచ్చింది. అయితే ఆయన ఆ పురస్కారాన్ని తిరస్కరించారు. గద్దర్ భార్య విమల. ఆయనకు ముగ్గురు పిల్లలు సూర్యుడు, చంద్రుడు, వెన్నెల ఉన్నారు. ప్రజాగాయకుడు కన్నుమూతతో విషాదఛాయలు అలుముకున్నాయి.
Governor Approves TSRTC Bill : ఆర్టీసీ బిల్లుకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదం
'పెద్ద నిర్ణయాలు తీసుకునే ప్రభుత్వం మాదే! అందుకే ప్రపంచంలో దేశ ఖ్యాతి పెరిగింది'