Youtube Videos Weapons: యూట్యూబ్ వీడియోలు చూసి ఆయుధాలు తయారు చేస్తున్న ఇద్దరు యువకులను తమిళనాడు పోలీసులు అరెస్టు చేశారు. అనుమానంగా బైక్‌పై తిరుగుతున్న ఇద్దరు యువకులను ప్రశ్నించగా.. పొంతన లేకుండా సమాధానాలు చెప్పారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా.. అసలు బాగోతం బయటపడింది.
ఇదీ జరిగింది.. తమిళనాడులోని ఓమలూరు సమీపంలోని పులియంపట్టి వద్ద స్థానిక పోలీసులు కొద్ది రోజుల క్రితం వాహన తనిఖీలు చేపట్టారు. అదే సమయంలో సేలం నుంచి ఇద్దరు యువకులు ద్విచక్ర వాహనంపై అటుగా వచ్చారు. వారి కదలికలపై అనుమానం వచ్చి అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వేర్వేరు కోణాల్లో ప్రశ్నించారు. ఇద్దరు యువకులు పొంతనలేని సమాధానాలివ్వడం వల్ల.. వారి వద్ద ఉన్న బ్యాగును సోదా చేశారు. తుపాకీ, పెద్ద పిస్టల్, సగం తయారు చేసిన పెద్ద తుపాకీ, కత్తితో సహా మరికొన్ని ఆయుధాలు లభ్యమయ్యాయి. పోలీసులు వెంటనే వారిద్దరిని అరెస్ట్ చేసి తదుపరి విచారణ కోసం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
విచారణలో వారు సేలం జిల్లా ఎరుమపాళయం ప్రాంతానికి చెందిన నవీన్ చక్రవర్తి, సంజయ్ ప్రతాప్‌గా గుర్తించారు. వారిద్దరూ యూట్యూబ్ వీడియోలు చూస్తూ తుపాకులు, గ్రనేడ్‌లు, కత్తులతో సహా మందుగుండు సామగ్రి తయారు చేస్తున్నారని తేలింది. వెంటనే పోలీసులు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై ఆయుధ నిషేధ చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. కోర్టులో హాజరుపరిచి సేలం సెంట్రల్ జైలుకి తరలించారు.
ఇవీ చదవండి: 2 మామిడిపండ్లు చోరీ.. మైనర్లను కట్టేసి చితకబాదిన యజమాని