Modi UP visit: ఓట్లకోసం ఇచ్చే ఉచిత హామీలు దేశాభివృద్ధికి అత్యంత ప్రమాదకరమని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ప్రస్తుతం ఆధునిక సౌకర్యాలు కల్పించడమే కాకుండా దేశ భవిష్యత్‌ను కూడా నిర్మిస్తున్నామని తెలిపారు. యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలో ఉత్తర్‌ప్రదేశ్‌లో శాంతిభద్రతలు మెరుగపడటమే కాకుండా, వేగంగా అభివృద్ధి చెందుతున్నట్లు పేర్కొన్నారు. ఇదంతా డబుల్ ఇంజిన్ సర్కారుతోనే సాధ్యమవుతోందని మోదీ స్పష్టంచేశారు.
ఉత్తర్‌ప్రదేశ్‌లో నిర్మించిన 296 కిలోమీటర్ల బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్ వేను.. సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి ప్రధాని ప్రారంభించారు. రూ.14,850 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్ వే.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని 7 జిల్లాలను కలుపుతుంది. నాలుగు లైన్ల ఎక్స్‌ప్రెస్ వేను 6 లైన్లకు విస్తరించారు. ఈ రహదారి ద్వారా చిత్రకూట్ నుంచి దిల్లీకి ఆరు గంటల్లోనే చేరుకోవచ్చు. ఈ నేపథ్యంలో జలౌన్ జిల్లా ఒరాయ్ మండలం కైతేరీ గ్రామంలో నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రసంగించిన ప్రధాని మోదీ.. ఈ ఎక్స్‌ప్రెస్ వేతో చిత్రకూట్ నుంచి దిల్లీకి ప్రయాణం 3, 4 గంటలు తగ్గడమే కాకుండా పారిశ్రామికంగా బుందేల్‌ఖండ్ పరుగులు పెడుతుందన్నారు.