Parliament Winter Session 2022 : పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం సందర్భంగా పార్లమెంట్‌కు విచ్చేసిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ మీడియాతో మాట్లాడారు. జీ20కి భారత్ అధ్యక్షత వహించిన వేళ.. ఈ సమావేశాలు జరుగుతుండటం ప్రాధాన్యమని అన్నారు. చర్చలు సజావుగా సాగేందుకు సహకరించాలని ప్రధాని ప్రతిపక్షాలను కోరారు. కొత్త ఎంపీలకు సభలో అవకాశాలు కల్పించాలని అన్నారు.
‘‘శీతాకాల సమావేశాలకు నేడు తొలి రోజు. ఈ ఏడాది ఆగస్టు 15తో స్వతంత్ర భారతావనికి 75 ఏళ్లు పూర్తయ్యాయి. ఇక మనముందు ఉన్నది ఆజాదీకా అమృత్ కాల్. జీ20 సదస్సుకు భారత్ అధ్యక్షత వహిస్తున్న వేళ.. ఈ పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. అంతర్జాతీయ సమావేశంలో భారత్ ఘనమైన చోటు దక్కించుకుంటోంది. మన దేశంపై అంచనాలు పెరుగుతున్నాయి. ప్రపంచ వేదికలపై మన భాగస్వామ్యం పెరుగుతోంది. ఇప్పుడు జీ20 సదస్సుకు అధ్యక్షత వహించే అదృష్టం లభించింది. జీ20 కేవలం దౌత్య సమావేశం మాత్రమే కాదు. మన సామర్థ్యాన్ని ప్రపంచం ముందు ప్రదర్శించేందుకు వచ్చిన అద్భుత అవకాశం’’ అని మోదీ తెలిపారు.
దేశాన్ని అభివృద్ధిలో ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లడాన్ని దృష్టిలో ఉంచుకుని.. ఈ సమావేశాల్లో కీలక నిర్ణయాలు తీసుకునేందుకు ప్రయత్నాలు జరగాలని మోదీ ఆకాంక్షించారు. పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగేందుకు ప్రతిపక్షాలు సహకరించాలని కోరారు. ఈ చర్చలు సానుకూలంగా, ఫలప్రదంగా జరుగుతాయని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘‘కొత్త ఎంపీలు, యువ సభ్యులకు చర్చల్లో పాల్గొనే అవకాశం కల్పించాలని అన్ని రాజకీయ పార్టీల నేతలను కోరుతున్నా. ప్రజాస్వామ్య దేశంలో మరో తరాన్ని తీర్చిదిద్దాల్సిన బాధ్యత మనపై ఉంది. సభలకు ఆటంకం జరిగితే కొత్త ఎంపీలు మాట్లాడేందుకు అవకాశం ఉండదు. వారి బాధను అర్థం చేసుకోండి’’ అని ప్రధాని ఉభయ సభల సభ్యులను కోరారు.
బుధవారం నుంచి ప్రారంభం కానున్న శీతాకాల సమావేశాలు ఈ నెల 29 వరకు కొనసాగుతాయి. మొత్తం 23 రోజుల వ్యవధిలో ఉభయ సభలు 17 దఫాలు భేటీకానున్నాయి. 16 కొత్త వాటితో సహా 25 బిల్లులకు పార్లమెంటు ఆమోదం పొందాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుండగా కీలకమైన మూడు బిల్లులను స్థాయీ సంఘం పరిశీలనకు పంపించాలని కాంగ్రెస్ పార్టీ పట్టుపడుతోంది.