PM Modi: కరోనా మహమ్మారిపై చేస్తున్న పోరాటంలో సామాన్యుల జీవనోపాధి దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రులకు ప్రధాని మోదీ సూచించారు. ఆర్థిక కార్యకలాపాలకు తలెత్తే నష్టాన్ని అత్యల్పానికి పరిమితం చేయాలని పిలుపునిచ్చారు. గతంలో వచ్చిన కరోనా వేరియంట్లతో పోలిస్తే ఒమిక్రాన్ అనేక రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతోందని పేర్కొన్నారు. దానికి ముకుతాడు వేసేందుకు స్థానిక స్థాయుల్లో విస్తృత చర్యలు చేపట్టాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పారు. టీకా పంపిణీ వేగంగా సాగేలా చూడాలన్నారు. ప్రజారోగ్య సన్నద్ధత, వ్యాక్సినేషన్‌పై.. ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాధినేతలతో గురువారం నిర్వహించిన వర్చువల్ సమావేశంలో ప్రధాని ఈ మేరకు పలు అంశాలపై మాట్లాడారు.
మన టీకాలు ఆధిపత్యం ప్రదర్శిస్తున్నాయ్
"మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అదే సమయంలో ప్రజల్లో భయాందోళనలు పెరగకుండా చూడాలి. ప్రస్తుత పండగ సీజన్‌లో ప్రజలు, ప్రభుత్వ యంత్రాంగం ఏమాత్రం అలసత్వం ప్రదర్శించకూడదు. వేరియంట్ ఏదైనా సరే.. మహమ్మారిపై విజయం సాధించేందుకు మనవద్ద ఉన్న గొప్ప ఆయుధం టీకాయే. కాబట్టి టీకా పంపిణీ సాధ్యమైనంత త్వరగా 100% పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలి. భారత్‌లో తయారైన వ్యాక్సిన్లు ప్రపంచవ్యాప్తంగా తమ ఆధిపత్యాన్ని నిరూపించుకుంటున్నాయి. గంపగుత్తగా అంతటా కఠినమైన లాక్‌డౌన్ విధిస్తే ఆర్థిక వ్యవస్థ దెబ్బతినే ముప్పుంటుంది. స్థానికంగానే వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యలపై ఎక్కువగా దృష్టిసారించండి. కొవిడ్‌కు అడ్డుకట్ట వేసే వ్యూహాలకు రూపకల్పన చేసే సమయంలో.. సామాన్య ప్రజల జీవనోపాధిని, ఆర్థిక వ్యవస్థను రక్షించుకునే జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. ఆర్థిక కార్యకలాపాలు కొనసాగేలా చూడండి. కొవిడ్ బారినపడ్డవారిలో ఎక్కువమంది ఇళ్లలోనే ఉండి చికిత్స పొందేలా ఏర్పాట్లు చేయండి. టెలీ మెడిసిన్ వంటివి ఇందుకు దోహదపడతాయి. దేశంలో కరోనా తొలి రెండు ఉద్ధృతుల సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత క్రియాశీలకంగా వ్యవహరించాయి. అదే మంత్రంతో ఇప్పుడూ విజయం సాధిద్దాం. కరోనా వ్యాప్తిని ఎంత తక్కువకు పరిమితం చేస్తే.. సమస్యలు అంత తక్కువగా ఉంటాయి." అని మోదీ అన్నారు.
ఈ సమావేశంలో కేంద్రహోంమంత్రి అమిత్‌షా, ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ పాల్గొన్నారు. కొవిడ్ తొలి రెండు ఉద్ధృతుల సమయంలో రాష్ట్రాల్లో మౌలిక వసతులను మెరుగుపర్చేందుకు కేంద్రం తరఫున నిధులు సమకూర్చి అండగా నిలిచినందుకు ప్రధానికి సీఎంలు కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చూడండి: కొవాగ్జిన్ మరో ఘనత.. 'యూనివర్సల్ వ్యాక్సిన్'గా గుర్తింపు!