కార్గిల్ విజయ్ దివస్(Vijay Diwas 2021) సందర్భంగా అమరవీరులకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నివాళులు అర్పించారు. కశ్మీర్ ద్రాస్‌లోని అమరవీరుల స్మారక చిహ్నాన్ని సందర్శించి.. నివాళులు అర్పించాలని మొదట నిర్ణయించినా వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవటం వల్ల ఆయన పర్యటన రద్దయింది. దీంతో.. బారాముల్లాలోని యుద్ధ స్మారకం వద్ద రాష్ట్రపతి నివాళులు అర్పించారు.
ప్రతిరోజూ స్ఫూర్తి..
ప్రధాని నరేంద్ర మోదీ, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అమర జవాన్లకు నివాళులు అర్పించారు. యుద్ధంలో వీరోచితంగా పోరాడి ప్రాణాలను త్యాగం చేసిన సైనికులను దేశం ఎల్లప్పుడూ స్మరించుకుంటుందని మోదీ అన్నారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. జవాన్ల వీరోచిత పోరాటాలు ప్రతిరోజూ స్ఫూర్తిని కలిగిస్తాయన్నారు.
వెంకయ్య నివాళి
1999 భారత్, పాకిస్థాన్‌ల మధ్య జరిగిన కార్గిల్ యుద్ధంలో వీరమరణం పొందిన సైనికులకు నివాళులు అర్పించారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. కార్గిల్ హీరోలకు సెల్యూట్ చేస్తున్నానని అన్నారు. వారి త్యాగాలను దేశం ఎప్పటికీ మరువదన్నారు.
హృదయపూర్వక నివాళి..
కార్గిల్ హీరోలకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నివాళులు అర్పించారు. కార్గిల్ విజయ్ దివస్(Vijay Diwas 2021) సందర్భంగా వీరులకు హృదయ పూర్వక నివాళులు అర్పిస్తున్నట్లు రాహుల్ తెలిపారు. దేశ త్రివర్ణపతాక గౌరవాన్ని.. సైనికులు నలుదిశలా చాటారని కొనియాడారు. వారి త్యాగాలను దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుదన్నారు.
రాజ్‌నాథ్‌సింగ్ నివాళులు


కార్గిల్ విజయ్ దివస్(Vijay Diwas 2021) సందర్భంగా.. రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్.. అమరవీరులకు నివాళులు అర్పించారు. దిల్లీలోని జాతీయ స్మారకానికి పుష్పగుచ్ఛాలు సమర్పించి సెల్యూట్ చేశారు.
సైనికాధికారుల నివాళులు



త్రిదళాధిపతి బిపిన్ రావత్.. కార్గిల్ విజయ్ దివస్(Vijay Diwas 2021) సందర్భంగా కశ్మీర్ ద్రాస్‌లోని అమరవీరుల స్మారక చిహ్నానికి.. నివాళులు అర్పించారు. ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం. నరవాణె, ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ బదౌరియా, నేవీ వైస్ చీఫ్ జీ.అశోక్ కుమార్.. నివాళులు అర్పించారు.
ఇదీ చదవండి: గవర్నర్‌ను కలవనున్న యడ్డీ- రాజీనామా కోసమేనా?