PM Modi Fires On Opposition : కేంద్రంలోని తమ ప్రభుత్వాన్ని కూలదోయడాన్నే 'ఇండియా' కూటమి లక్ష్యంగా పెట్టుకుందని ప్రధాని మోదీ విమర్శించారు. కానీ, దేశానికి ఉజ్వల భవిష్యత్తును అందించడమే బీజేపీ ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. మంగళవారం దిల్లీలో జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పాల్గొన్న ప్రధాని ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాల తీరును ఆయన తప్పుపట్టారు.
''పార్లమెంటులో జరిగిన భద్రతా ఉల్లంఘనను ప్రజాస్వామ్య విలువలపై విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరూ ఖండించాలి. కానీ, విపక్షాలు ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నాయి. ఇలాంటి ప్రవర్తన వల్ల 2024 లోక్సభ ఎన్నికల్లో వారి సీట్ల సంఖ్య మరింత తగ్గుతుంది. బీజేపీ అధిక స్థానాల్లో విజయం సాధిస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ప్రతిపక్షాలు తీవ్ర నిరాశకు గురయ్యాయి. అందుకే పార్లమెంటు నిర్వహణకు వారు అడ్డుపడుతున్నారు. దేశానికి ఉజ్వల భవిష్యత్తు అందించాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. కేంద్ర ప్రభుత్వాన్ని కూలదోయాలని 'ఇండియా కూటమి' లక్ష్యంగా పెట్టుకుంది''
-- నరేంద్ర మోదీ, భారత ప్రధాని
ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు, విమర్శలకు మర్యాదపూర్వకంగా స్పందించాలని, ప్రజాస్వామ్యంపై విశ్వాసం ఉంచాలని ప్రధాని మోదీ బీజేపీ ఎంపీలకు సూచించారని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. పార్లమెంట్ సమావేశాలు ముగిసిన తర్వాత ఎంపీలు సరిహద్దు గ్రామాల్లో పర్యటించాలని ప్రధాని కోరినట్లు వెల్లడించారు.
MPs Suspended From Parliament Today : పార్లమెంటులో భద్రతా ఉల్లంఘనపై కేంద్ర హోం మంత్రి ప్రకటన చేయాలని మంగళవారం ఉభయ సభల్లో ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. దీంతో సభా కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తున్నాయనే ఆరోపణలతో లోక్‌సభలో మరో 49 మందిని సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన వారిలో ఫరూఖ్ అబ్దుల్లా, శశిథరూర్, మనీశ్ తివారి, సుప్రియా సూలే, కార్తి చిదంబరం, ఫైజల్, సుదీప్ బందోపాధ్యాయ, డింపుల్ యాదవ్, డానిష్ అలీ ఉన్నారు. ఇప్పటికే పార్లమెంటు నుంచి 78 మంది సభ్యులపై సస్పెన్షన్ వేటు పడింది. దీంతో ఈ శీతాకాల సమావేశాల్లో ఇప్పటివరకు సస్పెన్షన్‌కు గురైన విపక్ష ఎంపీల సంఖ్య 141కు పెరిగింది.