'ఎఫైర్ పెట్టుకోవాల్సిన టైంలో కరెంట్ ఎఫైర్స్ చదువుతున్నాను. ఉద్యోగం రాని కారణంగా ప్రేమించిన వ్యక్తికి నా మనసులోని మాటను చెప్పలేకపోతున్నాను.' అంటూ ఓ యువతి బిహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌కు లేఖ రాసింది. "మీరు ప్రేమ వివాహం చేసుకున్నారు.. కానీ నిరుద్యోగం నా పెళ్లికి అడ్డంకిగా మారింది" అంటూ తేజస్వీ యాదవ్‌కు రాసిన లేఖలో ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ లేఖ సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్‌గా మారింది.
పింకీ అనే యువతి పేరిట ఈ లేఖ వచ్చింది. చాలా కాలంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న ఆ యువతి.. ఉద్యోగం రాలేదనే ఆవేదనతో ఉపముఖ్యమంత్రికి లేఖ రాసినట్లు తెలుస్తోంది. నాలుగు సంవత్సరాలుగా తాను ప్రభాత్ అనే రచయితను ప్రేమిస్తున్నట్లు ఆ లేఖలో పేర్కొంది. అతడిని వన్‌సైడ్ లవ్ చేస్తున్నట్లు వెల్లడించింది. ఉద్యోగం వస్తే ప్రేమ విషయాన్ని చెప్పాలకున్నట్లు ఆ యువతి తెలిపింది. అయితే ఉద్యోగం రానందువల్ల తన ప్రేమ విషయాన్ని చెప్పలేకపోతున్నానంటూ వాపోయింది. ఒక్కసారి కూడా ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడలేదని.. ఒకవేళ వచ్చినా పేపర్ లీక్ అవుతోందని అసహనం వ్యక్తం చేసింది.
తన తండ్రి తనకు పెళ్లి చేయాలనుకుంటున్నాడని లేఖలో పేర్కొన్న పింకీ.. ఇవన్నీ ఆలోచిస్తే తాను చాలా నిరాశకు గురవుతున్నానని చెప్పింది. ఈ లేఖను ఎంతో ఆశతో రాస్తున్నానని.. తనకు ఉద్యోగం వస్తుందని భావిస్తున్నట్లు అందులో పేర్కొంది. లేకపోతే తాను ప్రేమించిన రచయితకు దూరమవుతానని ఆవేదన వ్యక్తం చేసింది.
ఎవరీ ప్రభాత్?
ప్రభాత్ ఔరంగాబాద్‌కు చెందిన వ్యక్తి. అతనొక యువ రచయిత. ఈయన రాసిన బనారస్ వాలా ఇష్క్, యూ కెన్ కాల్ మీ కాఫీర్ అనే పుస్తకాలు బాగా ప్రాచుర్యం పొందాయి. ఆయన టీవీ సీరియళ్లకు కథలు కూడా రాశారు. ఇటీవల ఫిక్స్ రేట్ అనే షార్ట్ ఫిల్మ్ తీశారు.
"నాకు పింకీ ఎవరో తెలియదు. నేను ఎవ్వరితోనూ ప్రేమలో లేను. నా భార్య నాపై కోపంగా ఉంది. ఈ లేఖలో నిరుద్యోగం అనే అంశం ప్రధానంగా ఉంది. ఇక్కడ కేవలం నన్ను ప్రచారానికే వాడుకున్నారు. పింకీకి కావల్సింది ప్రేమ కాదు, ఉద్యోగం మాత్రమే." అని రచయిత ప్రభాత్ తెలిపారు. పింకీ లేఖపై తేజస్వీ యాదవ్ స్పందన కోసం వేచి చూస్తున్నానని.. లేకపోతే తాను ఫిబ్రవరి 14న పింకీకి బదులిస్తానని ప్రభాత్ వెల్లడించారు.