Pawan Kalyan Janavani: వారాహి యాత్రతో రాష్ట్ర రాజకీయాల్లో మార్పు వచ్చి తీరుతుందని.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. అందుకు కొంత సమయం పడుతుందన్న ఆయన.. ఈలోపే వైసీపీ నేతలు, మంత్రులు ఇష్టారీతిన నోరు పారేసుకోవద్దని హెచ్చరించారు. తానేమీ చేసినా అందులో రాష్ట్ర ప్రయోజనాలు ఇమిడి ఉంటాయని పవన్ స్పష్టం చేశారు. ప్రజలు చైతన్యంగా లేకపోతే అరాచకం రాజ్యమేలుతుందని పవన్ అన్నారు. అరాచకాలను ఎదుర్కోవడానికి జనవాణి కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రజల క్షేమం కోసం వారాహి యాత్ర చేపడుతున్నామన్న పవన్.. అందుకు ప్రజల ఆశీర్వాదం కావాలన్నారు. వైసీపీ నాయకుల దూషణలపైనా స్పందించారు. మాటలతో కాదు ఏదైనా చేతలతో చూపిస్తామన్నారు.
ఆరుద్ర విషయంపై మానవ హక్కుల సంఘంతో మాట్లాడుతా: కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలులో జనవాణి కార్యక్రమం నిర్వహించిన పవన్.. ప్రజల నుంచి 32 అర్జీలను ఆయన స్వీకరించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వైసీపీ ప్రభుత్వం తమను ఏమాత్రం పట్టించుకోవడం లేదని దివ్యాంగులు పవన్ వద్ద గోడు వెళ్లబోసుకున్నారు. కింద కూర్చొని పవన్ వారి బాధలు విన్నారు.సమస్య పరిష్కారానికి సంబంధిత అధికారులతో మాట్లాడతామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా స్థానిక దివ్యాంగులు.. ఆరుద్ర విషయాన్ని పవన్ వద్ద ప్రస్తావించారు. బిడ్డకు చికిత్స చేయించుకునేందుకు పోరాడుతున్న ఆరుద్రను.. ప్రభుత్వం పిచ్చిదానిగా ముద్ర వేసే ప్రయత్నం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమెను కాపాడాలని కోరారు.
అదే జనవాణి కార్యక్రమానికి కారణం: గతంలో సీఎం నివాసం ఉండే తాడేపల్లి ప్రాంతంలో ఓ మహిళ తన దగ్గరికి వచ్చి సమస్య చెప్పుకొందని.. తనకు అర్జీ ఇచ్చిన కొద్ది రోజులకే మహిళ అన్నని కిడ్నాప్ చేశారని.. నాలుగు రోజుల తర్వాత శవాన్ని తీసుకొచ్చారని.. కష్టం చెప్పుకోవడానికి తన దగ్గరకు వచ్చిన అబ్బాయిని అన్యాయంగా చంపేశారని.. ఆ తర్వాత మళ్లీ ఆ యువతి తన దగ్గరికి వచ్చి జరిగిన విషయం చెప్పిందని.. ఆ చెల్లెలు ఆవేదనే జనవాణి కార్యక్రమానికి శ్రీకారం చుట్టేలా చేసిందని పవన్ తెలిపారు. ఆరుద్ర విషయంపై మానవ హక్కుల సంఘంతో మాట్లాడతానని పవన్ కల్యాణ్ వారికి హామీ ఇచ్చారు. దీంతో గొల్లప్రోలులో జనవాణి కార్యక్రమం ముగిసింది. పవన్ గొల్లప్రోలు నుంచి చేబ్రోలు బయలుదేరారు. అక్కడ పట్టు రైతులు, చేనేత కళాకారులతో భేటీ కానున్నారు.
"ప్రజలు చైతన్యంగా లేకపోతే అరాచకం రాజ్యమేలుతుంది. అరాచకాలను ఎదుర్కోవడానికి జనవాణి కార్యక్రమం చేపట్టాం. జనవాణి కార్యక్రమంలో 32 పిటిషన్లు స్వీకరించాం. పిటిషన్ల సమస్యల పరిష్కారానికి ఆయా విభాగాలకు పంపుతాం. ఏపీ రాజకీయాల్లో మార్పు తెచ్చేలా వారాహి యాత్ర ఉంటుంది. రాష్ట్రం అభివృద్ధి చెందాలనేదే జనసేన ధ్యేయం. కులాలుగా విడిపోకుండా ఆంధ్రా భావనతో ముందుకెళ్లాలి. జనసేన చేపట్టిన వారాహి యాత్రకు ప్రజల ఆశీస్సులు కావాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజల క్షేమం కోసం యాత్ర చేపడుతున్నాం. మాటలతో కాదు ఏదైనా చేతలతో చూపిస్తాం."-పవన్ కల్యాణ్, జనసేన అధినేత
పిఠాపురం నియోజకవర్గ పరిస్థితులపై ప్రముఖులతో సమావేశం: కత్తిపూడిలో సభ అనంతరం పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలులో మాధురీ విద్యా సంస్థల నిర్వాహకుడు తమ్మల నాయుడు ఇంట్లో పవన్ బస చేశారు. జనవాణి కార్యక్రమానికి ముందుగా ఉదయం 11 గంటలకు సత్య కృష్ణ ఫంక్షన్ హాలులో పీఠాపురం నియోజకవర్గ అంశాలు, పరిస్థితులు, సమస్యలపై స్థానికంగా ఉన్న ప్రముఖులు, విద్యావేత్తలు, వ్యాపారులు, న్యాయవాదులు, వైద్యులు, ఇతర రంగాల పెద్దలతో సమావేశం నిర్వహించారు. ప్రతి ఒక్కరితో మాట్లాడి అంశాలను నోట్ చేసుకున్నారు. స్థానిక సమస్యలు, రంగాల వారీగా ఉన్న క్షేత్ర స్థాయి పరిస్థితులను పవన్ కల్యాణ్‌కి ప్రముఖులు వివరించారు.