om birla latest news: ప్రజా పద్దుల సంఘం (పీఏసీ) ఔన్నత్యం క్రమంగా పెరుగుతోందని.. సంఘంపై ప్రజల ఆశలు, అంచనాలూ పెరిగాయని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా వ్యాఖ్యానించారు. దిల్లీలో ఆదివారం నిర్వహించిన పీఏసీ శతాబ్ది ఉత్సవాల ముగింపు సభలో ఆయన ప్రసంగించారు. దేశాభివృద్ధికి ప్రజా పద్దుల సంఘం కార్యనిర్వాహక సంఘాన్ని జవాబుదారీగా చేయాలని, పంక్తిలో చివరి వరుసలో నిలిచిన వ్యక్తికి ప్రయోజనం, సంక్షేమం దక్కేలా చేయాలని సూచించారు. తాము అవలంభిస్తున్న ఉత్తమ విధానాలను పరస్పరం తెలుసుకునేందుకు, తమ అనుభవాలు పంచుకునేందుకు కేంద్ర, వివిధ రాష్ట్రాల పీఏసీలు ఉమ్మడి డిజిటల్ వేదికను రూపొందించుకోవాలని సూచించారు. సంఘాలు ఎంత ఎక్కువగా ప్రజలతో మమేకమైతే అవి చేసే సిఫార్సులు అంత ప్రభావవంతంగా, అర్థవంతంగా ఉంటాయని తెలిపారు.
పీఏసీల ఛైర్మన్లతో ఓ కమిటీ ఏర్పాటు చేయాలని, ఆ కమిటీ పీఏసీల పనితీరుపై సమగ్ర చర్చ జరిపి అవి మరింత ప్రభావవంతంగా పని చేసేలా మేధోమధనం చేయాలని సభాపతి అభిప్రాయపడ్డారు. పనిలో పారదర్శకత పెంపునకు సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా ఉపయోగించాలని ఓం బిర్లా సూచించారు.
ఇదీ చూడండి: రక్షణ ఒప్పందాలే ప్రధాన అజెండాగా మోదీ-పుతిన్ భేటీ!