ఒక్కొకరికి ఒక్కో వ్యాపకం ఉంటుంది. కొందరు పాత నాణేలు సేకరిస్తే.. మరికొందరు నోట్లు.. పురాతన కాలం నాటి వస్తువులు కూడబెడతారు. ఇలానే ఒడిశాకు చెందిన ఓ వ్యక్తి దేశంలోని వార్తాపత్రికలనే కాకుండా ప్రపంచ నలుమూలల నుంచి ఇతర పేపర్లను సేకరిస్తున్నారు. అదే ఆయనకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటుదక్కేలా చేసింది. 'పేపర్మ్యాన్ ఆఫ్ ఇండియా'గానూ ఖ్యాతి గడించారు సాషా శేఖర్ దాస్. సేకరించిన వాటితో కలిపి ఓ పేపర్ మ్యూజియం కూడా ఏర్పాటు చేశారు దాస్.
శేఖర్ దాస్.. మొదట జర్నలిస్టుగా పనిచేసేవారు. దీంతో ఆ సమయంలోనే వివిధ పత్రికలు సేకరించేవారు. అలా అది అలవాటుగా మారిపోయింది. దాస్ 2000 సంవత్సరంలో ఈ సేకరణకు శ్రీకారం చుట్టారు. తొలుత దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన పత్రికలను సేకరించేవారు. ఆ తర్వాత 153 దేశాల్లోని 94 భాషలకు సంబంధించిన 5,100 పత్రికలను సేకరించారు.
"మా నాన్న పేరుపై జైపుర్ గ్రామంలో ఓ మ్యూజియం ఏర్పాటు చేశాను. నేను సేకరించిన పత్రికలను అక్కడ ప్రదర్శనకు పెట్టాను. జర్నలిస్టులు, విద్యార్థులు వచ్చి ఈ పత్రికలను చూసి వెళ్తున్నారు"
-శేఖర్ దాస్, పేపర్మ్యాన్ ఆఫ్ ఇండియా
మొత్తంగా 10 వేలకుపైగా వార్తాపత్రికలను సేకరించిన శేఖర్ దాస్‌ను.. తాజాగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ వరించింది. అంతకుముందు ఇటలీకి చెందిన సెర్గియో బోదనీపై ఉన్న రికార్డును తన పేరిట లిఖించుకున్నారు. శేఖర్ దాస్ ఇప్పటివరకు మూడు సార్లు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో, ఒకసారి ఇండియా బుక్, ఓఎమ్‌జీ బుక్, క్రెడెన్స్ బుక్‌లో స్థానం సంపాదించుకున్నారు.
ఇదీ చదవండి: చేయి లేకపోయినా ప్రభుత్వ ఉద్యోగం పక్కా.. భర్త బాధితురాలికి సీఎం భరోసా!