Swami Sivananda : చూడటానికి అరవై ఏళ్ల వ్యక్తిలా కనిపించే ఈయన వయసు 126. వినడానికి ఆశ్చర్యం కలిగించినా ఇది వాస్తవం. ఇప్పటికీ చెక్కు చెదరని రూపుతో ఉత్తర్‌ప్రదేశ్ వారణాసి పురవీధుల్లో సంచరించే ఆయన పేరు స్వామి శివానంద. ఈ ఏడాది మార్చిలో పద్మశ్రీ అవార్డును అందుకున్న ఆయన దినచర్య కూడా ఎంతో క్రమశిక్షణగా ఉంటుంది.
బంగ్లాదేశ్‌లోని సైల్హెత్లో 1896న జన్మించారు. ఆరేళ్ల వయసులో తల్లిదండ్రులను పోగొట్టుకున్న ఆయన బంగాల్లోని నాబాద్వీప్లోని ఓ ఆశ్రమంలో స్థిరపడ్డారు. అక్కడే పెరిగి పెద్దయిన ఆయన 1979లో వారణాసికి వెళ్లారు. అప్పటి నుంచి తన జీవితాన్ని అక్కడే గడుపుతున్నారు. ఈయన ఆహారపు అలవాట్లతో పాటు దినచర్య కూడా అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. రాత్రి 9 గంటలకు పడకుని ఉదయం 3 గంటలకు లేస్తారు. సుమారు 2 గంటలు నడిచి తర్వాత యోగా చేయడం ప్రారంభిస్తారు.
గంట పాటు సాగే యోగా అభ్యాసంలో సర్వాంగ, పవనముక్త, సూర్యనమస్కారాలు లాంటి క్లిష్టమైన ఆసనాలను అవలీలగా చేస్తారు. కఠినమైన ఆహార నియామాలను పాటిస్తారు. అన్నంతో పాటు అన్ని రకాల కూరగాయలను తింటారు. కోల్‌కతాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో క్రమం తప్పకుండా మెడికల్ చెకప్ చేయించుకుంటారు. వయోరీత్యా వినికిడి లోపం ప్రారంభమైనప్పటికీ మరే ఇతర ఆరోగ్య సమస్యలు ఆయనకు లేవని వైద్యులు తెలిపారు.
ఇప్పటికే స్వామి శివానందను పద్మశ్రీతో పాటు సౌత్ ఆఫ్రికన్ సంస్థ అందించే శాంతి బహుమతి వరించగా.. గిన్నిస్ బుక్‌లోనూ ఆయన పేరు నమోదయ్యేందుకు సర్వం సిద్ధంగా ఉందని సమాచారం.
"యోగా వల్ల ప్రజల ఆయుష్షు పెరుగుతుంది. నేను తెల్లవారుజామున లేచి సర్వాంగాసనం చేస్తాను. యోగా చేయండి, మితంగా తినండి, చింతించకండి."
- స్వామి శివానంద