Odisha Accident Today : ఒడిశాలోని గంజాం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 12 మంది ప్రయాణికులు మృతి చెందారు. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. జిల్లాలోని దిగపహండి సమీపంలో ఒడిశా ఆర్టీసీ బస్సు, పెళ్లి బస్సు పరస్పరం ఢీకొన్నాయి. సమచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం వేకువజామును ఒంటి గంట ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ప్రమాద తీవ్రత ధాటికి రెండు బస్సులు.. పూర్తిగా నుజ్జునుజ్జుయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. సహాయక చర్యలు ప్రారంభించారు. పెద్ద ఎత్తున అంబులెన్స్‌లు కూడా అక్కడికి చేరుకున్నాయి. గాయపడిన వారిని బ్రహ్మపురలోని MKCG ఆస్పత్రికి తరలించారు. రెండు బస్సుల్లో ప్రయాణికులు గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
Odisha Bus Accident Today : అయితే ప్రైవేటు బస్సులోని వారే.. ఎక్కువ మంది మరణించినట్లు సమాచారం. "ఓఎస్‌ఆర్‌టీసీ బస్సు రాయ్గఢ నుంచి భువనేశ్వర్‌కు వెళ్తోంది. బ్రహ్మపుర ప్రాంతంలోని ఖండదేయులి గ్రామం నుంచి ప్రైవేట్ బస్సులో ఒక వివాహ బృందం ప్రయాణిస్తోంది. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నాం. ఒక బస్సు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. మరో బస్సు డ్రైవర్ ఆచూకీ లేదు" అని అధికారులు తెలిపారు.
సీఎం సంతాపం..
ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్.. గంజాం జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో మరణించిన వారి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.3 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి ప్రమాదం జరిగిన వెంటనే నవీన్ సర్కార్ రూ.30,000 పరిహారం ప్రకటించింది.
మరో రోడ్డు ప్రమాదం.. ఎనిమిది మంది మృతి
మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది మరణించారు. దాపోలి-హర్నే రహదారిపై ట్రక్కు, రిక్షా పరస్పరం ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఎనిమిది మంది మరణించగా.. కొందరు ప్రయాణికులు గాయపడ్డారు. ఈ ఘటనపై మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ శిందే.. విచారం వ్యక్తం చేశారు. మృతి చెందిన వారి కుటుంబాలకు.. సీఎం సహాయ నిధి నుంచి ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి ప్రభుత్వ ఖర్చుతో మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.