ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో చాలా మంది కళాకారులు ఉంటారు. తమదైన శైలిలో తమ కళతో ఆకట్టుకుంటారు. కొందరు ఎలాంటి శిక్షణ, అనుభవం లేకుండానే తమలోని కళను ప్రదర్శించి ప్రజల దృష్టిని ఆకర్షిస్తుంటారు. అలాంటి కోవకే చెందుతారు మహరాష్ట్రలోని వర్ధాకు చెందిన దాబిర్ షేక్. పాడైపోయిన పాత టైర్లతో వివిధ కళాకృతులు తయారు చేశారు. పంక్చర్లు వేస్తూనే తనలోని కళతో స్వచ్ఛతపై అవగాహన కల్పిస్తున్నారు.
వర్ధాలో దాబిర్ షేక్ పంక్చర్ దుకాణం నడుపుతున్నారు. కొద్ది రోజులకు దుకాణంలో చాలా టైర్లు పోగయ్యాయి. చాలా మంది ఇలా పోగైన టైర్లను చెత్త కుప్పలో పడేస్తుంటారు. వాటిలో వర్షం నీరు చేరి దోమలకు ఆవాసంగా మారతాయి. కాల్చితే కాలుష్యానికి కారణమవుతాయి. ఈ సమస్యను అర్థం చేసుకున్న దాబిర్ షేక్.. వాటితో ఏదైనా కొత్తగా చేసి ప్రజల్లో స్వచ్ఛతపై అవగాహన కల్పించాలనుకున్నారు. అప్పుడే ఓ ఆలోచన తట్టింది. పాత టైర్లను ఉపయోగించి వివిధ రకాల ఆకృతులను సృష్టించి ప్రదర్శించాలనుకున్నారు. ఆలోచన రావటమే ఆలస్యం.. ఖాళీ సమయాల్లో పని మొదలుపెట్టారు. పలు కళాఖండాలకు రూపం ఇచ్చి తన దుకాణం ముందు రోడ్డుకు ఇరువైపులా ఏర్పాటు చేశారు. ఆ వైపునకు వచ్చి పోయేవారు వాటిని చూసి సెల్ఫీలు తీసుకుంటున్నారు. దాబిర్ షేక్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
తాను పాత టైర్లతో కళాకృతులను చేయటం ప్రారంభించాక.. ప్రజలు తనను ఇష్టపడటం మొదలెట్టారని, అందువల్ల ఈ పనిని కొనసాగిస్తున్నానని తెలిపారు దాబిర్ షేక్. ఇది తమ ప్రాంతంలో పరిశుభ్రతను పాటించేందుకూ సాయపడుతోందన్నారు. డ్రాగన్స్, తాబేళ్లు, బైకులు, పూల కుండీలు సహా వివిధ ఆకృతులను తయారు చేసినట్లు చెప్పారు.
"నేను ఎక్కడా చూసి దీనిని నేర్చుకోలేదు. పంక్చర్లు వేసే మా వద్ద టైర్లు మాత్రమే ఉంటాయి. పాత టైర్లు ఎక్కువగా పోగవుతుంటాయి. వాటిని ఏమి చేయాలా అని ఆలోచించేవాడిని. స్వచ్ఛతపై అవగాహన కల్పించేందుకు ఏదైనా చేయాలని అనుకునేవాడిని. ఆ ఆలోచనతోనే వీటిని తయారు చేస్తున్నాను. కొన్నింటిని ప్రజలు తీసుకెళ్తున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇటుగా వచ్చిపోయేవారు వాటిని చూసి చాలా బాగా చేస్తున్నారని చెబుతున్నారు. చాలా ఆనందంగా ఉంది."
- దాబిర్ షేక్, పంక్చర్ షాప్ యజమాని.
టైర్లను బయట పారేయటం ద్వారా అందులో నీరు నిలిచి అపరిశుభ్రతకు కారణమవుతుందనే ప్రకటనలు చూసిన ప్రజలు ఇంట్లో ఉన్న టైర్లను తన వద్దకు తీసుకొస్తున్నారని చెప్పారు దాబిర్ షేక్. వాటితో వివిధ కళాకృతులను చేయించుకుని ఇంట్లో వాడుకునేందుకు తీసుకెళ్తున్నారని తెలిపారు. పాత వాటితో తయారు చేసిన కళాకృతులతో తమ ప్రాంత ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన కల్పించగలుతున్నట్లు చెప్పారు.
ఇదీ చూడండి: 200కేజీల బరువు.. ఇద్దరు భార్యలు.. ఈ భారీకాయుడి మెనూ చూస్తే..