Nithyananda is No More?: తాను చనిపోయినట్లు వస్తున్న వార్తలపై స్పందించారు వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద స్వామి. బతికే ఉన్నానని, 27 మంది డాక్టర్లు తనకు చికిత్స చేస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. ఈక్వెడార్‌కు సమీపంలోని ఓ ద్వీపంలో ఉంటున్న నిత్యానంద.. కొద్దిరోజుల కిందట అనారోగ్యంతో చనిపోయినట్లు వార్తలొచ్చాయి. తాజాగా ఈ వదంతులపై స్పందిస్తూ నిత్యానంద.. ఫేస్బుక్లో ఓ పోస్ట్ పెట్టారు. తాను సమాధిలోకి వెళ్లానని, శిష్యులు కంగారుపడొద్దని స్పష్టం చేశారు. అయితే ప్రస్తుతానికి మాట్లాడలేకపోతున్నట్లు, మనుషులను గుర్తుపట్టలేకపోతున్నట్లు ఫేస్బుక్ పోస్ట్‌లో ఉంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
''నేను చనిపోలేదు. ప్రస్తుతం సమాధిలో(సుప్తావస్థ) ఉన్నాను. నేను మరణించినట్లు కొందరు పుకార్లను వ్యాప్తిచేస్తున్నారు. నేను సమాధిలోకి వెళ్లాను. ప్రస్తుతం మాట్లాడలేకపోతున్నాను. అందుకు కాస్త సమయం పడుతుంది. మనుషులు, పేర్లు, ప్రాంతాలను గుర్తుపట్టలేకపోతున్నా. 27 మంది వైద్యులు నాకు చికిత్స చేస్తున్నారు.''
- నిత్యానంద ఫేస్బుక్ పోస్ట్
భారత్‌లో లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ స్వామీజీ 50 సార్లు కోర్టుకు హాజరై.. 2019 నవంబర్‌లో భారత్ వదిలి పారిపోయారు. 'కైలాస' అనేది నిత్యానంద ప్రపంచం. దానికి తనని తాను ప్రధానిగా ప్రకటించుకున్నారు. కైలాసను పత్యేక దేశంగా ప్రకటించాలని ఐక్యరాజ్య సమితికి అభ్యర్థన కూడా చేసుకున్నారు. కొద్దిరోజులకు కైలాస డాలర్‌ను తీసుకొచ్చారు. తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ కైలాసను కూడా ప్రారంభించినట్లు ప్రకటించారు. అయితే, ఆయన ఎక్కడ ఉంటున్నారనే విషయం మాత్రం తెలియదు. ఈక్వెడార్‌కు సమీపంలోని ఓ ద్వీపంలో ఆయన నివాసం ఉంటున్నట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఈక్వెడార్ మాత్రం ఈ వార్తలను ఖండిస్తోంది.
'కైలాస' అధికారిక వెబ్‌సైట్.. రోజూ నిత్యానందకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తుంటుంది. ఫేస్బుక్లో ఫొటోలు, వీడియోలను అప్డేట్ చేస్తుంటుంది. తాజాగా.. ఆయన ఫొటోలు సహా, ఆయన పేపర్‌పై రాస్తున్నట్లు ఉన్న చిత్రాలను షేర్ చేసింది. అయితే ప్రస్తుతం.. కైలాస ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిత్యానంద బతికిఉన్నారా? చనిపోయారా? అనేది మిస్టరీగా ఉంది.
ఇవీ చూడండి: నిత్యానంద 'రిజర్వ్ బ్యాంకు ఆఫ్ కైలాస'