Nara Lokesh Press Meet at Rajahmundry Central Jail: వ్యవస్థలను మేనేజ్ చేసి ప్రజల మధ్యకు చంద్రబాబును రానీయకుండా చేస్తున్నారని నారా లోకేశ్ వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఏ తప్పూ చేయకపోయినా వ్యక్తిగత కక్షతోనే అరెస్టు చేశారని.. చంద్రబాబును బంధించి ఇవాళ్టికి 50 రోజులైందని అన్నారు. రాజమండ్రి జైలులో చంద్రబాబుతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, భువనేశ్వరితో పాటు ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ములాఖత్ అయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో లోకేశ్ మాట్లాడారు.
రాష్ట్రంలో వ్యక్తిగత కక్ష సాధింపులు ప్రత్యక్షంగా చూస్తున్నామన్న లోకేశ్.. చంద్రబాబు చనిపోవాలి.. చంద్రబాబును చంపేస్తామని బాహాటంగా వైసీపీ నేతలు చెబుతుండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసుకు ఎలాంటి సంబంధం లేని తన తల్లిని కూడా జైలుకు పంపిస్తామని వైసీపీకు చెందిన మహిళా మంత్రి వ్యాఖ్యానించారని తెలిపారు. 50 రోజులుగా చంద్రబాబును జైలులో ఉంచి ఏం సాధించారన్న లోకేశ్.. కొత్త ఆధారమైనా ప్రజల ముందు పెట్టారా అని ప్రశ్నించారు.
చంద్రబాబు ఏ తప్పూ చేయలేదని గట్టిగా చెబుతున్నా: స్కిల్, ఫైబర్‌నెట్ ఏ కేసులోనైనా కొత్త ఆధారాలు ఏమైనా చూపారా అంటూ నిలదీశారు. పార్టీ ఖాతాకు డబ్బులు వచ్చాయని అంటున్నారని.. ఆధారమైనా ఉన్నాయా అని ధ్వజమెత్తారు. స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ అజయ్‌రెడ్డి అన్ని సెంటర్లు నడుస్తున్నాయని చాలా స్పష్టంగా చెప్పారన్న లోకేశ్.. టీడీపీ అధినేత చంద్రబాబు ఏ తప్పూ చేయలేదని గట్టిగా చెబుతున్నామని స్పష్టం చేశారు.
ఒక్క రూపాయి కూడా అవినీతి చేయలేదు: ధైర్యం ఉంటే ఆధారాలు ప్రజల ముందుంచాలని లోకేశ్ సవాల్ చేశారు. వ్యవస్థలను మేనేజ్ చేసి చంద్రబాబును ప్రజల్లోకి వెళ్లకుండా చేస్తున్నారని.. 'నిజం గెలవాలి' పేరుతో ప్రజల్లోకి తన తల్లి వెళ్తే ఆమెను కూడా అరెస్టు చేస్తామంటారా అంటూ మండిపడ్డారు. స్కిల్ కేసులో తమకు, తమ కుటుంబం, మిత్రులకుగానీ ఎలాంటి పాత్ర లేదని తెలిపారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఒక్క రూపాయి కూడా అవినీతి చేయలేదని.. తమ ఆస్తులు, ఐటీ రిటర్న్‌లు ప్రజల ముందుంచేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.
బస్సు యాత్ర పేరుతో గాలి యాత్ర చేస్తున్నారు: వ్యవస్థలను మేనేజ్ చేసి చంద్రబాబు ప్రజల్లోకి రానీయకుండా సైకో జగన్ బంధించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబును బయటకు రానీయకుండా లాయర్ ఫీజు పదేసి కోట్లు ఖర్చుపెడుతున్నారని ఆరోపించిన లోకేశ్.. 32 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగితే.. పట్టించుకునే పరిస్థితి లేదని దుయ్యబట్టారు. రైతులకోసం కాకుండా బస్సు యాత్ర పేరుతో గాలి యాత్ర చేస్తున్నారని మండిపడ్డ లోకేశ్.. నిరుద్యోగ సమస్యతో యువత చాలా ఇబ్బంది పడుతోందని పేర్కొన్నారు.
సైకో జగన్‌ను వదిలిపెట్టము.. ప్రజల తరఫున పోరాడతాం: వైసీపీ నాయకుడికి దారి ఇవ్వలేదని బస్సును ఆపి డ్రైవర్‌పై దాడిచేశారని.. ఆ వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్‌గా మారిందని తెలిపారు. డ్రైవర్‌పై దాడిచేసిన వారిపై ఇంతవరకు ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని.. తెలుగుదేశం నాయకులపై మాత్రం కేసులు పెట్టి జైళ్లకు పంపుతున్నారని అన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారన్న లోకేశ్.. సైకో జగన్‌ను వదిలిపెట్టమని.. ప్రజల తరఫున పోరాడతామని స్పష్టం చేశారు.
బెయిల్‌పై పదేళ్లు జగన్ బయట ఎలా: ఆధారాలు ఉంటే బయటపెట్టాలని సవాల్ చేస్తున్నాన్న లోకేశ్.. వ్యవస్థలను మేనేజ్ చేయడం వల్లే చంద్రబాబు జైలులో ఉన్నారని పునరుద్ఘాటించారు. వ్యవస్థలను మేనేజ్ చేయకపోతే బెయిల్‌పై పదేళ్లు జగన్ బయట ఎలా ఉన్నారని.. సొంత బాబాయిని చంపిన అవినాష్ బయట ఎలా ఉన్నారని ప్రశ్నించారు. ఏ తప్పూ చేయని వ్యక్తిని 50 రోజులుగా రాజమండ్రి జైలులో బంధించారని.. ఈ ప్రభుత్వంపై తాము నమ్మకం కోల్పోయామని అన్నారు.
ఏం చేస్తారోనని భయంగా ఉంది: వైద్య పరీక్షల పేరుతో ఏం చేస్తారోనని భయంగా ఉందని చంద్రబాబు ఆరోగ్యం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. జైలు పరిసరాలలో డ్రోన్లు ఎగురుతున్నాయని.. గంజాయి సరఫరా జరుగుతోందని ఆరోపించిన లోకేశ్.. చంద్రబాబు లోపలికి వెళ్లే దృశ్యాలు ఎలా బయటకొచ్చాయని నిలదీశారు. కాల్‌డేటా రికార్డులన్నీ బయటపెట్టాలని.. చంద్రబాబు బరువు తగ్గిన మాట వాస్తవమని తెలిపారు.
Nara Lokesh on Psycho Jaganasura: 'దేశం చేస్తోంది రావణాసుర దహనం - మనం చేద్దాం జగనాసుర దహనం'