Nara Bhuvaneshwari Comments: ''తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు త్వరలోనే జైలు నుంచి విడుదలవుతారు. రెట్టింపు ఉత్సాహంతో ప్రజల కోసం ఆయన కష్టపడతారు. ఆ దేవుడు దయతో, ప్రజల మద్దతుతో, కార్యకర్తలు పోరాడుతారు.. మళ్లీ ఈ రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయి. వైసీపీది ధనబలం-టీడీపీది ప్రజాబలం. 2024లో జరగబోయే కురుక్షేత్ర సంగ్రామంలో టీడీపీ, జనసేనలు అఖండ విజయం సాధిస్తాయి.. ఇది తథ్యం.'' అని చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు.
Nara Bhuvaneshwari Nijam Gelawali programme: ఈ నెల 25వ తేదీ నుంచి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి 'నిజం గెలవాలి' పేరుతో చంద్రబాబు అక్రమ అరెస్ట్‌తో మనోవేదనకు గురై, ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న విషయం తెలిసిందే. మొదటి రోజు తిరుపతి జిల్లా నారావారిపల్లెలో పర్యటించిన ఆమె.. రెండవ, మూడవ రోజు శ్రీకాళహస్తి, తిరుపతి నియోజకవర్గాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా శుక్రవారం శ్రీకాళహస్తిలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొని.. ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న అరాచకాలపై ప్రసంగించారు.
Nara Bhuvaneshwari Comments: ''అంబేడ్కర్ రాసిన రాజ్యాంగమే మన దేశాన్ని నడిపిస్తోంది. రాజ్యాంగాన్ని అమలు చేసే వారిపై అంబేడ్కర్ కొన్ని విషయాలు చెప్పారు. పాలకులు మంచివారైతేనే ప్రజలకు మేలు జరుగుతోందన్నారు. పాలకులు చెడ్డవారైతే ప్రజలకు కీడు జరుగుతుందని అంబేడ్కర్ చెప్పారు. వాళ్లది ధనబలం.. మనది ప్రజాబలం. వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన అఖండ విజయం సాధిస్తుంది. నిజం గెలవాలి.. నిజమే గెలవాలి. ఎన్టీఆర్.. తెలుగువారి ఆత్మగౌరవం పెంచితే.. చంద్రబాబు.. తెలుగువారిలో ఆత్మవిశ్వాసం పెంచారు. చంద్రబాబు అవినీతి చేశారంటే ప్రజలు నమ్మడం లేదు. పరిశ్రమలు ఏర్పాటు చేయడమే చంద్రబాబు చేసిన తప్పా..?, అమరావతి నిర్మించడం తప్పా..?, పోలవరం కట్టడం తప్పా..?. వైసీపీ పాలనలో ఏపీ అంటే అరాచకం..అప్పుల రాష్ట్రం.'' అని నారా భువనేశ్వరి ధ్వజమెత్తారు.
Bhuvaneshwari on Establishment of TCL Company: అనంతరం చంద్రబాబు నాయుడి చొరవతో టీసీఎల్ కంపెనీ ఏర్పాటైందని తెలిసి.. తాను చాలా గర్వపడ్డానని నారా భువనేశ్వరి ట్విటర్ వేదికగా తెలిపారు. మంచి ఎప్పటికైనా నిలుస్తుందని, నిజం తప్పక గెలుస్తుందని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అంటే కమీషన్ కోసం కంపెనీలను బెదరగొట్టడం, కరెంటు బిల్లుల గురించి అడిగితే కేసులు పెట్టడం అని భువనేశ్వరి వ్యాఖ్యానించారు. నిత్యావసరాల ధరలు అధికంగా ఉన్న రాష్ట్రంగా, రాజధాని లేని రాష్ట్రంగా మారిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
''ఇప్పుడు ఏపీ అంటే అన్నదాతల ఆత్మహత్యలు, గంజాయి, నిరుద్యోగుల వ్యసనాలు. ఇప్పడు ఏపీ అంటే మహిళలపై దాడులు, హత్యాచారాలు,సెటిల్‌మెంట్, భూ దందాలు, అవినీతి పాలనగా దేశంలో పేరుగాంచింది.''-నారా భువనేశ్వరి, టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి