కశ్మీర్ లోయలో శతాబ్దాల నాటి సోదర, స్నేహభావం పునరావృతమైంది. తుపాకుల మోతలతో దద్దరిల్లే ఈ ప్రాంతంలో మత సామరస్యం వెల్లువిరిసింది. మధ్యకశ్మీర్‌లోని గందర్‌బల్‌లో జరిగిన కశ్మీరీ పండిట్ మహిళ పెళ్లి ఇందుకు వేదికైంది. స్థానిక ముస్లింలు పెళ్లి పెద్దలుగా మారి మత సామరస్యాన్ని చాటారు. గందర్‌బల్‌లో జరిగిన దివంగత మోహన్‌లాల్ పండిట్ కుమార్తె మీనా కుమారి పెళ్లికి స్థానిక ముస్లింలు అందరూ హాజరయ్యారు. అయితే పెళ్లికి రావడమే కాదు.. సంప్రదాయ పద్ధతిలో పెళ్లిలో జరగాల్సిన అన్ని పనులను దగ్గరుండి చూసుకున్నారు.
కశ్మీర్‌లో శతాబ్దాల నాటి మత సామరస్యం, సోదరభావం ఇంకా ఉందని ఈటీవీ భారత్‌తో చెప్పారు ఒక కశ్మీరీ పండిట్. 'ఇక్కడ నివసించే ముస్లింలు, హిందువులు సామరస్యంగా జీవిస్తున్నారు. ఒకరికొకరు సుఖదుఃఖాలను పంచుకుంటారు. కశ్మీర్‌లో ఒకరి శుభకార్యాలయాలకు ఒకరు హాజరవుతారు. వేడుకల్లో ముస్లింలు, పండిట్‌లు ఒకే టేబుల్‌పై భోజనం చేస్తారు. మతపరమైన వేడుకలకు పరస్పరం హాజరవుతారు' అని ఆయన చెప్పారు.
తండ్రిని కోల్పోయిన మీనా కుమారిని తాము ఎంతో ప్రేమగా చూసుకున్నామని 'ఈటీవీ భారత్'తో చెప్పారు స్థానికంగా ఉండే ఒక ముస్లిం. 'తండ్రి లేడనే భావన.. మీనాలో లేకుండా ప్రేమగా చూసుకున్నాం. పెళ్లికి హాజరై మాకు చేతనైన సాయం చేశాం. ముఖ్యంగా మీనాకు శుభాకాంక్షలు చెప్పేందుకు వచ్చాం' ఆయన వివరించారు.
కశ్మీర్ లోయలో మూడు దశాబ్దాల క్రితం ప్రతికూల పరిస్థితుల కారణంగా.. చాలా మంది కశ్మీరీ పండిట్లు జమ్మూతో సహా ఇతర నగరాలకు వలస వెళ్లారు. అయితే ఇప్పటికీ.. చాలా పండిట్ కుటుంబాలు కశ్మీర్‌లోని వివిధ ప్రాంతాలలో నివసిస్తున్నాయి. పండిట్లు, ముస్లింలు పక్కపక్కనే నివసిస్తూ మతసామరస్యాన్ని చాటుతున్నారు.
ఇదీ చదవండి: హైవేపై ట్రక్కు-కారు ఢీ.. ఐదుగురు దుర్మరణం