ముంబయిలోని ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్‌ను పేల్చేస్తామని కాల్ చేసి బెదిరించిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. అతడిని త్వరలోనే అరెస్టు చేస్తామని తెలిపారు. మంగళవారం సాయంత్రం నిందితుడు.. స్కూల్‌కు బాంబు బెదిరింపు కాల్ చేశాడు. స్కూల్‌ను పేల్చేస్తామని బెదిరించాడు. స్కూల్ ల్యాండ్‌లైన్ నెంబర్‌కు మంగళవారం సాయంత్రం 4.30 గంటల సమయంలో ఈ కాల్ వచ్చిందని పోలీసులు తెలిపారు. పాఠశాలలో టైమ్ బాంబ్ పెట్టానని ఫోన్లో చెప్పి నిందితుడు కాల్ కట్ చేశాడని చెప్పారు.
బెదిరింపు కాల్ రాగానే స్కూల్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. వెంటనే దర్యాప్తు చేపట్టారు. బాంబ్ స్క్వాడ్‌ను రంగంలోకి దించి తనిఖీలు నిర్వహించారు. పాఠశాలలో ఎలాంటి పేలుడు పదార్థాలు దొరకలేదని పోలీసులు స్పష్టం చేశారు. అయితే, బాంబు బెదిరింపు కాల్ రాగానే స్కూల్లో ఆందోళనకర పరిస్థితులు ఏర్పడ్డాయి. కాగా, దుండగుడు స్కూల్‌కు రెండోసారి కాల్ చేసినట్లు పాఠశాల యాజమాన్యం ఫిర్యాదులో పేర్కొంది. తన ఆధార్, పాన్ కార్డుల వివరాలను సైతం స్కూల్‌కు పంపించాడని తెలిపింది.
"తన పేరు విక్రమ్ సింగ్ అని నిందితుడు చెప్పాడు. తనది గుజరాత్ అని, పాపులారిటీ సంపాదించేందుకే ఇలా కాల్ చేశానని తెలిపాడు. 'ఇలా చేస్తే మీడియాలో నా పేరు వస్తుంది. పోలీసులు అరెస్టు చేస్తారు. నేను ఫేమస్ అవుతా' అని కాల్ చేసి చెప్పాడు."
-స్కూల్ యాజమాన్యం ఫిర్యాదు
ఇటీవల రిలయన్స్ గ్రూప్‌నకు అనేకసార్లు బెదిరింపు కాల్స్ వచ్చాయి. గతేడాది అక్టోబర్‌లో రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్‌కు ఓ వ్యక్తి కాల్ చేసి.. ఆస్పత్రిని పేల్చేస్తామని బెదిరించాడు. అంబానీ కుటుంబానికి చెందిన కొంతమంది సభ్యుల పేర్లు చెప్పి మరీ బెదిరింపులకు పాల్పడ్డాడు. అదే ఏడాది ఆగస్టు 15న కూడా అంబానీ కుటుంబానికి బెదిరింపులు వచ్చాయి. అంబానీతో పాటు ఆయన కుటుంబాన్ని 3 గంటల్లో చంపేస్తామని ఓ ఆగంతుకుడు ఫోన్ చేశాడు.