Mulakhat with Chandrababu: రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో రిమాండ్‌లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ములాఖత్ అయ్యారు. చంద్రబాబుతో ములాఖత్ పూర్తయిన తరువాత పవన్ పొత్తుపై క్లారిటీ (Pawan Kalyan comments on alliances with TDP) ఇచ్చారు.
తెలుగుదేశం అధినేత చంద్రబాబును.. ఆ పార్టీ ఎమ్మెల్యే బాలకృష్ణ, కుమారుడు లోకేశ్, జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్.. రాజమహేంద్రవరం జైలులో కలుసుకున్నారు. చంద్రబాబుతో ములాఖత్ అయ్యేందుకు కారాగారంలోకి వెళ్లారు. ఈ భేటీలో వీరు.. పలు కీలక అంశాలపై చర్చించారు.
స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టై రాజమహేంద్రవరం కారాగారంలో ఉన్న చంద్రబాబును ఇప్పటికే లోకేశ్ తన తల్లి భువనేశ్వరి, భార్య బ్రాహ్మణితో కలిసి కలుసుకున్నారు. పవన్ కూడా బుధవారం.. జైలులో చంద్రబాబుతో ములాఖత్ అయ్యారు. బాలకృష్ణ.. చంద్రబాబును కలిసేందుకు తొలిసారి జైలులోకి వెళ్లారు. అరెస్ట్ అయ్యాక.. బాలకృష్ణ, లోకేశ్, పవన్ ముగ్గురూ కలిసి ఒకేసారి చంద్రబాబుతో సమావేశం కావడం.. ప్రాధాన్యం సంతరించుకుంది. అనుకున్నట్లుగానే సమావేశం అనంతరం పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుతో భేటీలో.. తాజా పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణ సహా పొత్తుల గురించి చర్చలు జరిగాయి.
చంద్రబాబును కలిసేందుకు తొలుత.. బాలకృష్ణ, లోకేశ్.. కలిసి రాజమహేంద్రవరం కారాగారం వద్దకు చేరుకున్నారు. వీరితో పాటు తెలుగుదేశం సీనియర్ నేత, MLA గోరంట్ల బుచ్చయ్యచౌదరి సహా పలువురు ముఖ్య నేతలు ఉన్నారు. రాజమహేంద్రవరం చేరుకునే ముందు బాలకృష్ణ.. తన సోదరి, చంద్రబాబు సతీమణి అయిన భువనేశ్వరితో పాటు కుమార్తె బ్రాహ్మణితో సమావేశమయ్యారు. అనంతరం మధ్యాహ్నం ములాఖత్‌లో బాలకృష్ణ.. చంద్రబాబును కలిశారు.
చంద్రబాబును కలిసేందుకు రాజమహేంద్రవరం చేరుకున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తన వాహన శ్రేణితో జైలు వద్దకు చేరుకున్నారు. పవన్ కారాగారం వద్దకు చేరుకున్నాక... బాలకృష్ణ, లోకేశ్‌తో కలిసి జైలులోకి వెళ్లారు. చంద్రబాబుతో ఈ ముగ్గురి ములాఖత్ నేపథ్యంలో... పోలీసులు జైలు వద్ద భద్రతను పెంచారు. కారాగారం వద్దకు తెలుగుదేశం కార్యకర్తలు, అభిమానులు, జనసైనికులు రాకుండా కఠిన ఆంక్షలు విధించారు.
పొత్తులకై క్లారిటీ: చంద్రబాబుతో బాలకృష్ణ, లోకేశ్, పవన్ ములాఖత్ ముగిసిన అనంతరం.. రాజమండ్రి కేంద్ర కారాగారం వద్ద మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు (TDP Janasena Alliance) ఉంటుందని పవన్ తెలిపారు. చంద్రబాబుతో ఈ ములాఖత్ చాలా కీలకమైనది అని పేర్కొన్న పవన్.. జనసేన, టీడీపీ కలిసే వెళ్తాయని అన్నారు. అదే సమయంలో బీజేపీ కూడా తమతో కలిసి వస్తుందని ఆశిస్తున్నట్లు పవన్ తెలిపారు.