మాహారాష్ట్ర.. పుణెలో ఓ వ్యక్తి అప్పు తిరిగి చెల్లించనందుకు భర్త కళ్ల ముందే అతడి భార్యపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ వడ్డీ వ్యాపారి. ఈ ఘటన ఫిబ్రవరిలో జరిగిందని.. నిందితుడిని అరెస్టు చేసినట్లు హడప్సర్ పోలీసులు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పుణెలో ఓ 47 ఏళ్ల వ్యక్తి వడ్డీ వ్యాపారం చేస్తున్నాడు. అతడి వద్ద ఓ వ్యక్తి అప్పు తీసుకున్నాడు. అయితే, ఆ అప్పును తిరిగి చెల్లించలేకపోయాడు. దీంతో భాదితుడిపై పగ పెంచుకున్న వడ్డీ వ్యాపారి.. ఈ ఏడాది ఫిబ్రవరిలో తాను అప్పు ఇచ్చిన వ్యక్తి ఇంటికి వెళ్లాడు. అనంతరం ఆ వ్యక్తి ముందే అతడి భార్యను కత్తితో బెదిరించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడు ఈ ఘటనను తన మొబైల్‌లో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ ఘటన పోలీసుల దృష్టికి వెళ్లడం వల్ల నిందితుడిపై సంబంధిత ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి.. అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
భార్యను చంపిన భర్త..
Husband Kills Wife : ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ జిల్లాలో ఓ వ్యక్తి.. కట్టుకున్న భార్యను హత్య చేశాడు. అనంతరం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జముల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. భగవత్‌నగర్‌లో ఉంటున్న దేవ్ సాహు అనే వ్యక్తి తన భార్య చమేలీ సాహు ప్రవర్తనపై అనుమానం వ్యక్తం చేశాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. మాటామాటా పెరిగి గొడవ తీవ్రంగా మారింది. దీంతో ఆగ్రహించిన నిందితుడు దేవ్ సాహు తన భార్య తలపై బరువైన పాత్రతో దాడి చేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మరణించింది.
బాలుడితో అసహజ శృంగారం.. లెక్చరర్‌కు జీవిత ఖైదు..
Unnatural Sex Offence : మైనర్ విద్యార్థిపై అసహజ శృంగారానికి పాల్పడ్డ ఓ ఉపాధ్యాయుడికి జిల్లా కోర్టు.. జీవిత ఖైదు విధించింది. కర్ణాటకలోని మంగళూరు అదనపు జిల్లా, సెషన్స్ కోర్టు ఈ తీర్పు వెలువరించింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కులాయికి చెందిన పృథ్వీరాజ్(33) అనే ఓ వ్యక్తి.. తన ఇంటికి రోజూ విద్యార్థిని రమ్మని చెప్పేవాడు. అసహజ శృంగారానికి పాల్పడేవాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే మార్కులు తగ్గించి ఇబ్బంది పెడతాడని బెదిరించే వాడు. సుమారు రెండేళ్లుగా అదే జరుగుతోంది. తాజాగా బాలుడి మర్మాంగానికి గాయం అయింది. ఆస్పత్రికి వెళ్లగా వైద్యుడికి విషయం తెలిసి.. విద్యార్థి కుటుంబసభ్యులకు చెప్పారు.
వెంటనే బాధితుడి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు. విచారణ జరిపిన జడ్జి మంజుల.. అతడిని దోషిగా నిర్ధరించి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు చెప్పారు. పోక్సో చట్టంలోని సెక్షన్ 6 కింద దోషికి జీవిత ఖైదుతోపాటు రూ.25,000 జరిమానా విధించారు. బాధిత బాలుడికి రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్ష పరిహారం ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.