Modi Diwali with soldiers : భారత్‌ను చెడు దృష్టితో చూసేవారికి దీటైన జవాబిచ్చే సత్తా, వ్యూహాలు దేశ సైనిక బలగాలకు ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టంచేశారు. అయితే.. యుద్ధం తమ చివరి ప్రత్యామ్నాయమని తేల్చిచెప్పారు. ఏటా సైనికులతో కలిసి దీపావళి జరుపుకుంటున్న ప్రధాని.. ఈసారి కార్గిల్‌లో జవాన్లతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. భారత సైనికులు ఎన్నో సంవత్సరాలుగా తన కుటుంబ సభ్యులుగా మారారని ఆయన చెప్పారు. దీపావళి వెలుగులు.. ప్రపంచంలో శాంతిని నింపాలని భారత్ అభిలషిస్తోందని వెల్లడించారు.
"యుద్ధాన్ని మేము ఎప్పుడూ తొలి ప్రత్యామ్నాయంగా చూడడంలేదు. మన వీరత్వం వల్లకానీ, సంస్కారం వల్లకానీ మనం యుద్ధాన్ని ఎప్పుడూ అంతిమ ప్రత్యామ్నాయంగానే చూస్తున్నాం. యుద్ధం లంకలో జరిగినా, తర్వాత కురుక్షేత్రంలో జరిగినా ఆఖరి వరకు ఆపేందుకు అన్ని ప్రయత్నాలు జరిగాయి. అలాగే మనం విశ్వశాంతిని కోరుకునేవాళ్లం. మేము యుద్ధానికి విరోధులం. అయితే బలం లేకుండా శాంతి కూడా సాధ్యంకాదు."
--నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి
సరిహద్దులు భద్రంగా, ఆర్థిక వ్యవస్థ బలంగా, సమాజం పూర్తి విశ్వాసంతో ఉన్నప్పుడు దేశం సురక్షితంగా ఉంటుందని మోదీ అభిప్రాయపడ్డారు. దేశం వెలుపల, లోపల ఉన్న శత్రువులను విజయవంతంగా ఎదుర్కోవడం వల్ల అంతర్జాతీయంగా భారత ప్రతిష్ఠ పెరిగిందన్నారు. అవినీతిపై నిర్ణయాత్మక పోరు సాగుతోందని ఆయన చెప్పారు. అవినీతిపరులు ఎంతటివారైనా వదిలేదిలేదని తేల్చిచెప్పారు.
దశాబ్దాలుగా సైనిక బలగాల్లో చేపట్టాల్సిన సంస్కరణలు నేడు అమలవుతున్నాయని వివరించారు ప్రధాని. సైనిక బలగాల్లో మహిళలను చేర్చుకోవడం మన బలాన్ని మరింత పెంచుతుందని అభిప్రాయపడ్డారు. విదేశీ ఆయుధాలు, వ్యవస్థలపై ఆధారపడాన్ని తగ్గించుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. దేశ భద్రతకు ఆత్మనిర్భర భారత్... చాలా ముఖ్యమని వివరించారు. భారత్ బలం పెరిగితే.. ప్రపంచశాంతి, సుస్థిరత కూడా పెరుగుతుందని మోదీ చెప్పారు.
భావోద్వేగ కలయిక..
మోదీ కార్గిల్ పర్యటన.. ఓ భావోద్వేగ కలయికకు వేదికైంది. 21 ఏళ్ల క్రితం విద్యార్థిగా మోదీని కలిసిన ఓ వ్యక్తి.. ఇప్పుడు ఓ ఆర్మీ అధికారి హోదాలో ప్రధానితో మాట్లాడారు. 2001లో గుజరాత్ బాలాచడీలోని సైనిక్ స్కూల్లో తీసిన ఫొటోను మోదీకి బహూకరించారు మేజర్ అమిత్. అప్పట్లో మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే తమ పాఠశాలకు వచ్చి, విద్యార్థులతో ముచ్చటించిన విషయాన్ని గుర్తు చేశారు. మరో విద్యార్థితో కలిపి అమిత్‌కు మోదీ షీల్డ్ అందించడాన్ని ఆ ఫొటోలో చూడొచ్చు.