MLA Rapaka Varaprasada Rao : రాష్ట్రంలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. తాజాగా జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ గెలవడంపై అధికార వైసీపీ పలు విమర్శలు చేసింది. తమ పార్టీ ఎమ్మెల్యేలకు టీడీపీ రూ.10 కోట్లు ఆఫర్ చేసిందని సంచలన వ్యాఖ్యలు చేసింది. అంతే కాకుండా క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారంటూ నలుగురు ఎమ్మల్యేలను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అయితే ఆ వ్యాఖ్యలను టీడీపీ నేతలు కొట్టిపారేశారు. ఈ క్రమంలోనే రాజోలు వైసీపీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు టీడీపీ రూ.10 కోట్లు ఆఫర్ ఇచ్చిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కానీ వాటిని తాను రిజెక్ట్ చేసినట్లు ఆయన చెప్పారు. అయితే ఆ వ్యాఖ్యలు చేసి 24 గంటలు కాకముందే మరోసారి రాపాక చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దొంగ ఓట్ల వల్లే తాను ఎమ్మెల్యేగా గెలిచినట్లు వివరించి సామాజిక మాధ్యమాల్లో మరొక్కసారి హాట్ టాపిక్ అయ్యారు.
అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంతర్వేదిలో ఈ నెల 24న జరిగిన వైసీపీ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న రాపాక పలు వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. పూర్వం నుంచి తన గ్రామమైన చింతలమోరికి ఓ బ్యాచ్ దొంగ ఓట్లు వేయడానికి వచ్చేవారని... అవే తన గెలుపునకు సహకరించేవంటూ ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ఇతర గ్రామాల నుంచి 15, 20 మంది వచ్చి తనకు దొంగ ఓట్లు వేసేవారని ఆయన అన్నారు. ఒక్కొక్కరు 10 దొంగ ఓట్లు వేయడం వల్లే గెలిచేవాడినని పలు షాకింగ్ కామెంట్స్ చేశారు. అప్పటి నుంచి తన గెలుపుకు దొంగ ఓట్లే కారణం అని వరప్రసాద్ కామెంట్స్ చేశారు.
"చాలా మంది మా సొంత ఊరు చింతలమోరికి దొంగ ఓట్లు వేయడానికి వచ్చేవారు. చింతలమోరిలో మా ఇంటి దగ్గర ఓ పోలింగ్ బూత్ ఉండేది. అక్కడికి ఏజెంట్‌గా ఎవరు వచ్చినా ఏం చేయలేరు. సుబాష్తో పాటు వాళ్లందరూ వచ్చి ఒక్కొక్కరు సుమారు ఆరు ఓట్లు వేసే వారు. ఇంకొంత మంది 15 నుంచి 20 ఓట్లు వేసేవారు. వాళ్లందరూ నాకు దొంగ ఓట్లు వేయడానికి వచ్చేవారు. అప్పటి నుంచి నా గెలుపుకు కారణం అదే"-రాపాక వరప్రసాద రావు, రాజోలు ఎమ్మెల్యే
ఇవీ చదవండి :