మహారాష్ట్రలో ఓ బంగాళదుంప మొక్కను చూసేందుకు జనాలు ఎగబడుతున్నారు. అందుకు గల కారణం తెలిస్తే మీరూ వెళ్లి చూద్దామనుకుంటున్నారు!. పుణె జిల్లాలోని ఇద్దరు యువరైతులు తమకున్న మూడు ఎకరాల పొలంలో బంగాళదుంపలను పంట వేశారు. కోతల సమయంలో తమ పంటను కోసేందుకు సిద్ధమయ్యారు. ఆ సమయంలో ఓ మొక్కను చూసి అవాక్కయ్యారు.
జిల్లాలోని ఆంబెగావా మండలంలోని నిర్గుడ్సర్ గ్రామంలో ప్రజలందరూ ఎక్కువగా బంగాళదుంప పంటను సాగు చేస్తుంటారు. అదే గ్రామానికి చెందిన సందీప్, ధనేశ్ పాండురంగ్ కూడా తమ పొలంలో బంగాళదుంప పంటను వేశారు. ఇటీవలే ఈ పంట చేతికందింది. కానీ అందులోని ఓ మొక్క వేళ్లకు కాయాల్సిన దుంపలు కొమ్మకు విరగ కాశాయి. దీంతో ఆ మొక్కను చూసి షాకయ్యారు.
ఎంతో కాలంగా బంగాళదుంపలను పండిస్తున్నాము కానీ ఇలా కొమ్మకు కాయడం చూసి ఆశ్చర్యంగా అనిపిస్తోందని స్థానికులు అంటున్నారు. చలికాలం కావడం వల్ల ఆ దుంపలు కాస్త పచ్చగా మారాయని తెలిపారు.