Mask mandatory rules: దేశంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టింది. రోజువారీ కొత్త కేసులు అత్యల్పంగా నమోదవుతున్నందున పరిస్థితులు సాధారణ స్థాయికి చేరుకుంటున్నాయి. ఈ క్రమంలోనే కొవిడ్ ఆంక్షలను సడలిస్తూ అటు కేంద్రంతో పాటు ఇటు పలు రాష్ట్రాలు నిర్ణయం తీసుకుంటున్నాయి. ఎప్పటికప్పుడు కొత్త మార్గదర్శకాలను విడుదల చేస్తున్నాయి. కరోనా వ్యాప్తి చెందిన రెండేళ్ల తర్వాత మాస్క్ తప్పనిసరి సహా అన్ని ఆంక్షలను ఏప్రిల్ 1 నుంచి ఎత్తివేస్తున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
- విపత్తు నిర్వహణ చట్టం 2005 ప్రకారం కరోనా కట్టడికి విధించిన అన్ని ఆంక్షల తొలగింపు. 2022, ఏప్రిల్ 1 నుంచి అమలులోకి. అన్ని జిల్లా విపత్తు నిర్వహణ అధికారులకు పలు సూచనలు జారీ.
- రాష్ట్ర ప్రజలు, వ్యాపార సముదాయాలు, సంస్థల్లో మాస్క్ ధరించటం, భౌతిక దూరం పాటించటం వంటి కొవిడ్ నియమాలు పాటించాలని సూచన. మరోవైపు.. కొత్త కేసులు, మరణాలు, వ్యాప్తి వంటి వాటిపై అప్రమత్తంగా ఉండాలని డీడీఎంఏలకు ఆదేశం.
మాస్క్‌పై జరిమానాలు బంద్: ఏప్రిల్ 1 నుంచి మాస్క్‌పై జరిమానాలు ఎత్తివేస్తున్నట్లు ముంబయి పోలీసులు తెలిపారు. మరోవైపు.. ప్రజలు స్వచ్ఛందంగా మాస్క్ ధరించాలని కోరింది బృహాన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్. ఏప్రిల్ 2 నుంచి అన్ని కొవిడ్ ఆంక్షలను ఎత్తివేయనున్నారు. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలో సోమవారం మంత్రివర్గం సమావేశమై కొవిడ్ ఆంక్షలపై కీలక నిర్ణయం తీసుకున్నట్లు ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ తోపే తెలిపారు. 'గుడి పడ్వా(మహారాష్ట్ర నూతన సంవత్సరం) నుంచి కొవిడ్-19 సంబంధించిన ఆంక్షలను తొలగిస్తున్నాం.' అని పేర్కొన్నారు. తాజా నిర్ణయంతో మాస్క్ ధరించటం తప్పనిసరి కాదు.
'నో మాస్క్' ఫైన్ తొలగింపు: కరోనా వైరస్ కేసులు భారీగా తగ్గిన క్రమంలో గురువారం కీలక నిర్ణయం తీసుకుంది దిల్లీ విపత్తు నిర్వహణ విభాగం(డీడీఎంఏ). బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించని వారికి ఇకపై జరిమానా విధించబోమని అధికారవర్గాలు తెలిపాయి. అయితే, రద్దీ ప్రాంతాల్లో మాస్క్ ధరించాలని సూచిస్తూ అడ్వైజరీ విడుదల చేయనున్నారని, లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ నేతృత్వంలో సమావేశమైన డీడీఎంఏ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాయి. ప్రస్తుతం బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ లేని వారికి రూ.500 జరిమానా విధిస్తోంది దిల్లీ ప్రభుత్వం.
బంగాల్లో కొవిడ్ ఆంక్షల ఎత్తివేత: బంగాల్లో కొవిడ్ పరిస్థితులు మెరుగుపడుతున్న క్రమంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గురువారం రాత్రి నుంచి కొవిడ్-19 సంబంధిత అన్ని ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. 2020, మార్చిలో కరోనా వ్యాప్తి చెందిన దాదాపు రెండేళ్ల తర్వాత పూర్తిస్థాయిలో ఆంక్షలు తొలగించారు. అయితే, మాస్క్‌లు ధరించటం, పరిశుభ్రత చర్యలు ప్రజలు తప్పనిసరిగా పాటించాలని పేర్కొంది.
ఇదీ చూడండి: ట'మాట'కు వృద్ధుడి ప్రాణం బలి- భార్యను టీజ్ చేశాడనుకుని కొట్టి చంపిన పక్కింటి వ్యక్తి!