Manipur polls 2022: చెదురుమదురు హింసాత్మక సంఘటనల మధ్య మణిపుర్ శాసనసభ ఎన్నికల తొలివిడత పోలింగ్ ముగిసింది. మణిపుర్లో మొత్తం 60 స్థానాలు ఉండగా తొలి విడతలో 5జిల్లాల పరిధిలోని 38 స్థానాలకు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మొత్తం 1,721 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరిగింది. సాయంత్రం 5 గంటల వరకు 78.03శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం తెలిపింది. కాంగ్‌పోక్పి జిల్లాలో అత్యధికంగా.. 82.79 శాతం ఓటింగ్ నమోదైంది.
మణిపుర్ గవర్నర్ గణేశన్.. సగోల్ బంద్‌లో ఓటు వేయగా, ముఖ్యమంత్రి ఎన్ బీరేన్ సింగ్ హింగాంగ్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
పలు చోట్ల ఘర్షణలు..
పోలింగ్ సందర్భంగా పలు చోట్ల హింసాత్మక ఘటనలు జరిగాయి. చురాచాంద్‌పుర్‌లో కాంగ్రెస్, భాజపా శ్రేణులు ఘర్షణకు దిగగా, ఒక వ్యక్తి గాయపడ్డారు. ఈవీఎంలు ధ్వంసమయ్యాయి. కాక్వా, కీరో ప్రాంతాల్లో కూడా ఉద్రిక్తతలు తలెత్తాయి. నాలుగు ఘటనలు జరిగినట్లు మణిపుర్ ఎన్నికల సంఘం తెలిపింది. అయితే, అందులో మూడింటిలో పోలింగ్ తిరిగి ప్రారంభం కాగా.. కాంగ్కోక్పి నియోజకవర్గం, కైతెల్మండి ప్రాంతంలోని పోలింగ్ బూత్‌లో ఈవీఎంలను ధ్వంసం చేయగా పోలింగ్ నిలిపివేసినట్లు ప్రకటించింది. ఈ ఘటనలో పలువురిని అరెస్ట్ చేసినట్లు చెప్పింది.
బరిలో ప్రముఖులు..
మణిపుర్ తొలి విడత ఎన్నికల్లో 173 మంది అభ్యర్థులు బరిలో ఉండగా.. వీరిలో 15 మంది మహిళలు ఉన్నారు. తొలి విడత అభ్యర్ధుల్లో ముఖ్యమంత్రి.. బీరేన్ సింగ్, ఉప ముఖ్యమంత్రి యుంనమ్ జోయ్ కుమార్, పీసీసీ అధ్యక్షుడు లోకేశ్ సింగ్ ఉన్నారు.
మార్చి 5న రెండో విడత..
రెండో విడత పోలింగ్ మార్చి 5న జరగనుండగా ఫలితాలు మార్చి 10న వెలువడనున్నాయి.
ఇదీ చూడండి: Russia Ukraine Crisis: ఉక్రెయిన్ సంక్షోభం నుంచి భారత్ ఏం నేర్చుకోవాలి?