Manipur Mob Violence : మణిపుర్‌లో హింసాత్మక వాతావరణం ఇంకా కొనసాగుతూనే ఉంది. మోరే జిల్లాలో దుండగులు బుధవారం రెచ్చిపోయారు. దుండగులు.. అనేక ఇళ్లకు నిప్పంటించారని అధికారులు తెలిపారు. అలాగే కాంగ్పోక్పిలో బస్సులను తగలబెట్టారని వెల్లడించారు. అయితే ఈ హింసాత్మక ఘటనల్లో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు చెప్పారు. మోరే జిల్లా మయన్మార్ సరిహద్దులో ఉంది.
సిబ్బందిని తరలించేందుకు భద్రతా బలగాలు ఉపయోగించే రెండు బస్సులను కాంగ్‌పోక్పి జిల్లాలో ఒక గుంపు మంగళవారం తగలబెట్టింది. ఆ ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే మోరేలో అనేక ఇళ్లకు నిప్పు, కాంగ్పోక్పిలో బస్సులను దహనం చేశారని అధికారులు చెప్పారు.
మణిపుర్ ఘటనపై అమెరికా స్పందన..
Manipur Violence US : ఈశాన్య రాష్ట్రం మణిపుర్‌లో కుకీ వర్గానికి చెందిన ఇద్దరు మహిళలను కొందరు పురుషులు నగ్నంగా ఊరేగించిన ఘటనపై అమెరికా తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనలో బాధితులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి వేదాంత్ పటేల్ అన్నారు. వారికి న్యాయం చేయడం కోసం భారత ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు మద్దతు ప్రకటిస్తున్నట్టు పేర్కొన్నారు. పాకిస్థానీ పాత్రికేయుడు అడిగిన ప్రశ్నకు.. వేదాంత్ పటేల్ ఈ మేరకు స్పందించారు. 'మణిపుర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన వీడియోను చూసి దిగ్భ్రాంతికి గురయ్యాం. ఏ నాగరిక సమాజంలోనైనా మహిళలపై ఇటువంటి హింస సిగ్గు చేటు.' అని అన్నారు.
కొద్దిరోజుల క్రితం భారత్‌లోని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి కూడా మణిపుర్‌లో కొనసాగుతున్న హింసపై ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని నిలువరించే విషయంలో భారత్ కోరితే సాయం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.
Manipur Violence Why : గత కొన్ని రోజులుగా ఈశాన్య రాష్ట్రం మణిపుర్ హింసాత్మక పరిస్థితులో నెలకొన్నాయి. ఎస్టీ హోదా కోసం మెయిటీల డిమాండ్‌కు మణిపుర్ వ్యాలీ ప్రాంతానికి చెందిన చట్టసభ్యుల నుంచి మద్దతు లభించింది. దీంతో గిరిజన ప్రాంత ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనంతరం ఇది ఘర్షణలకు దారితీసింది. మణిపుర్ రాష్ట్ర జనాభాలో 53 శాతం మంది మెయిటీ వర్గానికి చెందినవారే ఉన్నారు. మణిపుర్ వ్యాలీలోనూ వారి ప్రాబల్యం ఎక్కువగా ఉంది. బంగ్లాదేశ్, మయన్మార్ నుంచి వస్తోన్న అక్రమ వలసదారులతో తాము సమస్యలు ఎదుర్కొంటున్నామని వారు చెబుతున్నారు.