తమిళ నటుడు విజయ్ నటించిన ఓ సినిమాలో.. పిల్లల అవయవాలు తీసి బిక్షాటనకు పంపిస్తుంది ఓ ముఠా. అయితే అక్కడ హీరో విజయ్ వారిని కాపాడుతాడు. అలాంటి ఘటనే ఉత్తర్‌ప్రదేశ్ కాన్పూర్‌లో వెలుగుచూసింది. ఇక్కడ హీరో పాత్రలో కాన్పూర్ స్థానిక కౌన్సిలర్ నిలిచాడు. ఉద్యోగం వెతుకుంటూ నగరానికి వచ్చిన ఓ యువకుడి కళ్లలో రసాయనం పోసి, అవయవాలు తీసి రూ.70,000 లకు అమ్మేశాడు నిందితుడు.
పోలీసుల కథనం ప్రకారం..
ఉత్తర్‌ప్రదేశ్‌లోని సురేశ్ మాంఝీ అనే 30 ఏళ్ల వ్యక్తి ఉద్యోగం వెతుక్కుంటూ ఆరు నెలల క్రితం కాన్పూర్ వచ్చాడు. తనకు పరిచయమున్న విజయ్ అనే వ్యక్తి వద్దకు రాగా.. అతడిని కిడ్నాప్ చేసి కాళ్లుచేతులు విరిచాడు. అనంతరం అతని కళ్లలో రసాయనాలు పోసి అంధుడ్ని చేశాడు. ఆ తరువాత దిల్లీకి చెందిన.. రాజ్ అనే బిచ్చగాళ్ల ముఠానాయకుడికి రూ. 70,000లకు అమ్మేసాడు. అనంతరం ఆ ముఠా సురేశ్‌ను చిత్రహింసలకు గురిచేసి బలవంతంగా భిక్షాటన చేయించారు. అక్కడ సురేశ్ ఆరోగ్యం క్షీణించడం వల్ల తిరిగి కాన్పూర్ను పంపించారు. శుక్రవారం స్థానిక కౌన్సిలర్ ప్రశాంత్ శుక్లా అతడ్ని చూడగా.. ఘటన మొత్తం వెలుగులోకి వచ్చింది. దీంతో సురేష్.. స్థానిక కౌన్సిలర్ సహాయంతో నౌబస్తా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి జరిగిన విషయాన్ని వివరించాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు.