భాజపాపై చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమర్థించుకున్నారు. తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. పార్లమెంట్ వెలుపల చేసిన వ్యాఖ్యలపై సభలో చర్చ జరగాల్సిన అవసరం లేదన్నారు. "దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన వారిని మీరు క్షమాపణలు అడుగుతున్నారా?" అంటూ భాజపాను ప్రశ్నించారు. అనంతరం పలు అంశాల్లో కేంద్ర ప్రభుత్వం తీరును నిరసిస్తూ ప్రతిపక్షాలు సభ నుంచి వాకౌట్ చేశాయి.
మంగళవారం పార్లమెంట్ ప్రారంభం కాగానే.. భాజపా నేతలు ఖర్గే వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఆందోళన చేపట్టారు. రాజ్యసభలో కేంద్రమంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ.. అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఖర్గే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన క్షమాపణలు చెప్పేంతవరకు సభలో ఉండే అర్హత ఆయనకు లేదని పేర్కొన్నారు. స్వాతంత్ర్యం తర్వాత కాంగ్రెస్ కనుమరుగు కావాలని మహాత్మ గాంధీ భావించారని.. ప్రస్తుతం ఖర్గే అదే పనిలో ఉన్నారన్నారు పీయూష్ గోయల్. గాంధీజీ అన్న మాటను ఆయన నిజం చేసి చూపిస్తున్నారని తెలిపారు. ఎలా మాట్లాడాలో కూడా తెలియని వ్యక్తి పార్టీ జాతీయ అధ్యక్షుడు అని ఎద్దేవా చేశారు. రాజ్యసభతో అటు లోక్‌సభలోనూ భాజపా, కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం జరిగింది.
మనం చిన్న పిల్లలమా?: ధన్‌ఖడ్ మండిపాటు
ఖర్గే వ్యాఖ్యలతో రాజ్యసభలో కొంతసేపు గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ నేత క్షమాపణలు చెప్పాలంటూ భాజపా సభ్యులు నినాదాలు చేశారు. ఈ క్రమంలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కొందరు బల్లలపై నిల్చుని నిరసనలు చేశారు. ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ వారించినా వారు వినిపించుకోలేదు. దీంతో ధన్‌ఖడ్ అసహనానికి గురయ్యారు. "సభలో ఇలాంటి ప్రవర్తన మనకు చాలా చెడ్డపేరు తెస్తుంది. సభ నడిచే తీరుతో బయట ప్రజలు నిరుత్సాహానికి గురవుతున్నారు. కనీసం సభాపతి సూచనలను కూడా పట్టించుకోవట్లేదు. ఎంతటి బాధాకర పరిస్థితిని సృష్టిస్తున్నాం. నమ్మండి.. మనల్ని చూసి 135 కోట్ల మంది ప్రజలు నవ్వుతున్నారు" అని అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
"అది పార్లమెంట్ వెలుపల జరిగింది. దాని గురించి సభలో ఆందోళనలు సరికాదు. పక్షాల మధ్య అభిప్రాయభేదాలు ఉండొచ్చు. కానీ రాజ్యసభ పక్ష నేత మాట్లాడుతున్నప్పుడు ప్రతిపక్ష ఎంపీలు ఆటంకం కలిగించడం.. ప్రతిపక్ష నేత మాట్లాడుతుంటే మరో పక్షం అడ్డుకోవడం.. ఇవన్నీ ఏంటీ? మనమేం పిల్లలం కాదు" అని ధన్‌ఖడ్ సభ్యులపై మండిపడ్డారు.
అంతకుముందు భారత్ జోడో యాత్రలో భాగంగా రాజస్థాన్ అల్వార్‌లో నిర్వహించిన బహిరంగ సభలో మల్లికార్జున ఖర్గే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశ స్వాతంత్ర్యం కోసం రాజీవ్, ఇందిరా గాంధీ తమ ప్రాణాలను త్యాగం చేశారని, భాజపా నాయకులు ఏం చేశారో చెప్పాలని ఆయన నిలదీశారు. భాజపా నేతల ఇళ్ల నుంచి కనీసం ఒక శునకం కూడా బలిదానం చేయలేదని ఆయన ఘాటైన వ్యాఖ్యలు చేశారు.