Makar Sankranti 2024 Date and Time: సంక్రాంతి పండగకు మరికొన్ని రోజులే మిగిలి ఉన్నాయి. అయితే ఈ ఏడాది పండగ విషయంలో కాస్త కన్‌ఫ్యూజన్ నెలకొంది. ఎక్కువగా సంక్రాంతి పండగ జనవరి 14వ తేదీన వస్తుంది. ఈ సారి క్యాలెండర్‌లో మాత్రం 15వ తేదీన సంక్రాంతి పర్వదినం అని ఉంది. దీంతో.. పండగ ఎప్పుడు జరుపుకోవాలనే విషయంలో జనం అయోమయానికి గురవుతున్నారు. మరి.. దీనిపై పండితులు ఏం చెబుతున్నారో ఇప్పుడు చూద్దాం.
సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే రోజును.. మకర సంక్రాంతి (Sankranti) పర్వదినంగా జరుపుకుంటారు. పురాణాల ప్రకారం.. సూర్య భగవానుడు తన కుమారుడు అయిన శనిదేవుని ఇంటికి వస్తాడని చెబుతారు. ఈ సంక్రాంతి పండగను దేశంలో.. ఒక్కోచోట ఒక్కో విధంగా పిలుచుకుంటారు. మహారాష్ట్రలో 'మకర సంక్రాంతి' అని, తమిళనాడులో 'పొంగల్' అని, పశ్చిమ బెంగాల్‌లో 'పౌష్ పర్బన్' అని, గుజరాత్‌లో 'ఉత్తరాయణ్' అని, పంజాబ్లో లోహ్రీ అని సంక్రాంతిని పిలుస్తారు.
సంక్రాంతి 2024 - ఈ స్టార్ హీరోల సినిమాలు ఏ ఓటీటీలో వస్తున్నాయంటే?
తెలుగు రాష్ట్రాలో సందడే సందడి: ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండగ ఓ రేంజ్లో ఉంటుంది. ఈ సమయంలో కొత్త పంటలు ఇంటికి వస్తాయి. కొత్త అల్లుళ్ల రాకతో ఇళ్లు సందడిగా ఉంటాయి. కల్లాపి చల్లి, రంగు రంగుల రంగవళ్లులు వాకిట్లో వేసి, గొబ్బెమ్మలు పెట్టి.. అందంగా అలంకరిస్తారు. పిల్ల, పెద్దలు ఉదయాన్నే స్నానం చేసి, కొత్త బట్టలు ధరిస్తారు. మరికొందరు నదుల్లో పుణ్యస్నానం చేస్తారు. ఇలా చేయడంతో పాపాలు తొలగి, జీవితంలో మంచి కలుగుతుందని విశ్వసిస్తారు. ఉదయాన్నే ప్రత్యేక పూజలు ముగించిన తర్వాత.. పిల్లలు పతంగులు ఎగరవేయడంలో బిజీ బిజీగా ఉంటే... పిండి వంటలు చేయడంలో ఆడవారు.. కోడి పందాలతో పురుషులు సరదాగా గడుపుతారు.
మనకెన్ని పండుగలున్నా.. ఇంటింటి కాంతి సంక్రాంతే
ఈ ఏడాది పండగ ఎప్పుడు?: ఈ ఏడాది సంక్రాంతి విషయంపై పండితులు క్లారిటీ ఇచ్చారు. 15వ తేదీన ఈ పండగ జరుపుకోవాలని సూచిస్తున్నారు. ఏటా సూర్యుడి స్థానాన్ని బట్టి సంక్రాంతి 14వ తేదీన వస్తుంది. కానీ.. ఈ సారి లీపు సంవత్సరం రావడంతో పండగ 15వ తేదీకి మారింది. అలాగే భోగి పండగ 14వ తేదీన జరుపుకోవాలని సూచిస్తున్నారు. దృక్ పంచాంగం ప్రకారం సంక్రాంతి పుణ్యకాల సమయం 15వ తేదీ ఉదయం 7.15 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5.46 గంటలకు ముగియనుంది. ఇక మహాపుణ్యాకాలం ఉదయం 7.15 గంటలకు ప్రారంభమై ఉదయం 9 గంటలకు ముగియనుంది.
పూజ ఎప్పుడు చేయాలి..?: ప్రాంతాలను బట్టి పూజ సమయం మారుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ఉదయమే పూజ కార్యక్రమాలు ఉంటాయి. ఆ రోజు ఉదయం 7.15 గంటల నుంచి పుణ్యకాలం ఉండటంతో.. ఆ తర్వాత నుంచి ఎప్పుడైనా పూజ చేసుకునే వీలు ఉంటుంది. ఆరోజున చేసే ముఖ్యమైన పూజల్లో.. సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించడం అత్యంత ప్రధానమైనది.