Omicron cases in Maharashtra: మహారాష్ట్రలో మరో ఏడు ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయి. విదేశాలకు వెళ్లి వచ్చిన నలుగురు, వారిని కలిసిన ముగ్గురికి ఒమిక్రాన్ వేరియంట్ నిర్ధరణ అయినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
బాధితుల్లో నైజీరియా నుంచి వచ్చిన మహిళ, ఆమె ఇద్దరు కూతుళ్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. పుణె జిల్లా, పింప్రి చించ్వాడా ప్రాంతంలోని తన సోదరుడిని కలిసేందుకు వచ్చినట్లు చెప్పారు. దీంతో ఆమె సోదరుడు, ఆయన ఇద్దరు కుమార్తెలకు సైతం ఒమిక్రాన్ వేరియంట్ సోకిందని తెలిపారు. మరోవైపు.. ఫిన్లాండ్ నుంచి పుణెకు గత నెల చివర్లో వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్ నిర్ధరణ అయిందని వెల్లడించారు. మొత్తంగా ఏడుగురికి కొత్త వేరియంట్ నిర్ధరణ అయినట్లు చెప్పారు.
తాజాగా వెలుగు చూసిన కేసులతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 8 కేసులు వచ్చాయి.
దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తికి
ఇటీవల దక్షిణాఫ్రికా నుంచి దిల్లీ మీదుగా మహారాష్ట్ర, పుణెలోని దోంబివలీకి వచ్చిన 33 ఏళ్ల వ్యక్తికి ఒమిక్రాన్ వేరియంట్ వచ్చినట్లు అధికారులు శనివారం ప్రకటించారు. బాధితుడు మెరైన్ ఇంజినీర్‌గా చెప్పారు. కల్యాణ్ టౌన్‌లోని కొవిడ్-19 కేర్ సెంటర్లో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.
దేశవ్యాప్తంగా 12 కేసులు..
మహారాష్ట్రలో వెలుగు చూసిన తాజా కేసులతో దేశవ్యాప్తంగా మొత్తం 12 కేసులు వచ్చాయి. అందులో కర్ణాటకలో 2, దిల్లీ, గుజరాత్లో 1, మహారాష్ట్రంలో 8 కేసులు బయటపడ్డాయి.
Omicron cases in India, Omicron cases in Maharashtra, omicron virus