Raigad suspicious boat: మహారాష్ట్ర రాయగఢ్ జిల్లాలోని పర్యటక ప్రాంతమైన హరిహరేశ్వర్ బీచ్ వద్ద ఏకే47 ఆయుధాలు కలిగిన పడవ కనిపించడం కలకలం రేపింది. సముద్ర తీరంలో ఈ బోటు కనిపించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అందులో మూడు ఏకే 47 ఆయుధాలు ఉన్నట్లు వెల్లడించాయి. దీంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. జిల్లా వ్యాప్తంగా హైఅలర్ట్ జారీ చేశారు.
ముంబయికి 190 కిలోమీటర్ల దూరంలో ఉన్న శిరివర్ధన ప్రాంతంలో పలువురు స్థానికులు ఈ పడవను గుర్తించారు. బోటులో సిబ్బంది ఎవరూ లేరని చెప్పారు. అనంతరం స్థానికులు ఈ సమాచారాన్ని పోలీసులకు చేరవేయగా.. అధికారులు అప్రమత్తమయ్యారు. రాయగఢ్ ఎస్పీ అశోక్ దుధే, ఇతర సీనియర్ అధికారులు ఘటనాస్థలికి చేరుకొని.. బోటును తమ అధీనంలోకి తీసుకొన్నారు. తనిఖీలు చేయగా.. బోటులో మూడు ఏకే 47 రైఫిళ్లు, కొన్ని బుల్లెట్లు లభించాయని అధికారులు తెలిపారు. దీనిపై మరింత దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పడవ లభించిన చుట్టుపక్కల ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.
'పడవ వారిదే'
కాగా, ఈ బోటు ఆస్ట్రేలియాకు చెందిన ఓ వ్యక్తిదని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ తెలిపారు. సముద్ర ప్రయాణం మధ్యలోనే బోటు ఇంజిన్ దెబ్బతిందని, అందులో ఉన్నవారిని కొరియాకు చెందిన మరో పడవ కాపాడిందని వివరించారు.
'బోటులో ఏకే 47 రైఫిళ్లు ఉన్నాయి. పడవ సగం ధ్వంసమైంది. సముద్రంలో ఆగిపోయిన బోటు.. భారీ అలలకు తీరానికి కొట్టుకొచ్చింది. త్వరలో పండగల సీజన్ ఉంది కాబట్టి పోలీసులు, అధికారులను అప్రమత్తం చేశాం. యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ సైతం దీనిపై దృష్టిసారించింది. కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలకు సమాచారం అందించాం. అవసరమైతే అదనపు బలగాలు రంగంలోకి దించుతాం. తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలను తీసుకుంటున్నాం. పరిణామాలు ఏవైనా తేలికగా తీసుకోం' అని ఫడణవీస్ స్పష్టం చేశారు.