Maharashtra political crisis: మహారాష్ట్ర రాజకీయ ప్రతిష్టంభన సమయంలో శివసేన ఇరువర్గాలు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. వీటిని ఐదుగురు సభ్యుల ధర్మాసనానికి బదిలీ చేసింది. పిటిషన్లపై రాజ్యాంగపరమైన ప్రశ్నలు తలెత్తుతున్న నేపథ్యంలో దీనిపై విస్తృత ధర్మాసనం ఏర్పాటు అవసరమని గతంలో సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలోనే రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేశారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన సీజేఐ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం.. ఈ షెడ్యూల్‌కు సంబంధించి నబాం రెబియా కేసులో సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పు రాజ్యాంగ నైతికతకు విరుద్ధంగా ఉందని అభిప్రాయపడింది.
రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌కు సంబంధించిన కీలక అంశాలను పిటిషన్లు లేవనెత్తుతున్నాయని సీజేఐ తెలిపారు. అందువల్ల, ఎమ్మెల్యేల అనర్హత, గవర్నర్, స్పీకర్ల అధికారాలు, న్యాయ సమీక్షపై పరిశీలన జరపాల్సి ఉంటుందని చెప్పారు. ఈ నేపథ్యంలో శివసేన తమదేనని, పార్టీ గుర్తు తమకే కేటాయించాలని శిందేవర్గం పెట్టుకున్న అభ్యర్థనపై ఎన్నికల సంఘం ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయకూడదని స్పష్టం చేశారు.
స్పీకర్‌ను తొలగించేందుకు నోటీసులు జారీ చేసిన తర్వాత.. ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంపై స్పీకర్ తదుపరి చర్యలు కొనసాగించవచ్చా? అనే విషయాన్ని రాజ్యాంగ ధర్మాసనం పరిశీలించనుంది. వీటితో పాటు మరిన్ని అంశాలపై పరిశీలన చేయనుంది. ఆగస్టు 25న విస్తృత ధర్మాసనం వాదనలు విననుంది.
ఎన్నో పిటిషన్లు..
ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయి. నిజమైన శివసేన తమదేనని గుర్తించేలా ఆదేశాలు జారీ చేయాలని శిందే వర్గం సుప్రీంను ఆశ్రయించింది. కాగా, ఏక్నాథ్ శిందేను ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించడానికి వ్యతిరేకంగా ఠాక్రే వర్గం పిటిషన్ దాఖలు చేసింది. స్పీకర్ ఎన్నిక, బలపరీక్షను సైతం సవాల్ చేసింది. శివసేన గుర్తు తమకు కేటాయించాలంటూ శిందేవర్గం వేసిన పిటిషన్‌ను వ్యతిరేకిస్తూ మరో వ్యాజ్యం దాఖలు చేసింది. వీటితో పాటు శిందే, ఠాక్రే వర్గాలు దాఖలు చేసిన మరికొన్ని పిటిషన్లపై సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం విచారణ జరపనుంది.
విచారణకు బిల్కిస్ బానో దోషుల విడుదల కేసు
బిల్కిస్ బానో సామూహిక అత్యాచారం కేసు దోషులను విడుదల చేయడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకుంది. సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్, మరో న్యాయవాది అపర్న భట్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది. సుప్రీంకోర్టు ఆదేశాలను తాము సవాల్ చేయడం లేదని, క్షమాభిక్ష ప్రసాదించిన ప్రాతిపదికనే తాము వ్యతిరేకిస్తున్నామని న్యాయవాదులు వాదించారు.