తమిళనాడులో ఏటా అంగరంగ వైభవంగా జరిగే.. మధురై చితిరయ్ ఉత్సవాల్లో అపశృతి జరిగింది. కల్లఝగర్ స్వామి.. వైగై నదిలోకి ప్రవేశించడాన్ని చూసేందుకు వచ్చి.. ఐదుగురు భక్తులు మృతి చెందారు. ముగ్గురు నదిలో మునిగి చనిపోగా.. ఒకరు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. మరొకరు అనుమానాస్పదంగా చనిపోయారు. నది వద్ద పోలీసులు, ఫైర్, రెస్కూ సిబ్బంది భారీగా మోహరించినప్పటికీ ఈ ఘటన జరగడం గమనార్హం.
శుక్రవారం ఉదయం కల్లఝగర్ స్వామి.. వైగై నదిలోకి ప్రవేశించే కార్యక్రమం జరిగింది. దీన్ని చూసేందుకు లక్షల మంది భక్తులు వైగై నది వద్దకు చేరుకున్నారు. ఈ కార్యక్రమం ముగిసిన అనంతరం ఉదయం 10 గంటల ప్రాంతంలో తారాయిపాలెం సమీపాన నదిలో ఓ శవం తేలడాన్ని భక్తులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ఆసుపత్రికి తరలించారు. మృతుడుని నల్లమాయన్(42)గా పోలీసులు గుర్తించారు. ఇతడు సౌత్ మాసి స్ట్రీక్‌కు చెందినవాడని వారు వెల్లడించారు.
ఆ తరువాత మధ్యాహ్న సమయంలో అదే ప్రాంతంలో మరో రెండు మృతదేహాలను పోలీసులు గుర్తించారు. అనంతరం వారి మృతదేహాలను కూడా ఆసుపత్రికి తరలించారు. అందులో ఒకరిని ప్రేమ్ కుమార్(18)గా గుర్తించారు. అతడు వెలచేరి ప్రాంతానికి చెందన వ్యక్తి అని తెలిపారు. మరోవైపు, మతిచియంలోని మందగపడి సమీపంలో భక్తులపై నీళ్లు చల్లుతుండగా.. సుదలై ముత్తు(58) అనే ఆటో డ్రైవర్ గుండెపోటుతో మరణించాడు.
చితిరయ్ పండుగ తమిళనాడుకు చెందిన ప్రముఖ ఉత్సవాల్లో ఒకటి. ఈ పండగను ఏప్రిల్-మే మధ్యలో పది రోజుల పాటు ఘనంగా జరుపుతారు. భగవంతుడు కల్లఝర్ కల్లార్ రూపంలో అళగర్ కోవిల్ నుంచి బయలుదేరి పౌర్ణమి నాడు మధురై చేరుకుంటారు. అనంతరం వైగై నదిలోకి ప్రవేశిస్తారు. ఈ కార్యక్రమాన్ని చూసేందుకు లక్షలాది మంది భక్తులు వైగై నదికి తరలివస్తారు.
ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి..
వేగంగా వస్తున్న ట్రక్కు ఓ కారును ఢీకొట్టింది. దీంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురితో సహా.. డ్రైవర్ కూడా అక్కడిక్కడే మృతి చెందారు. మహారాష్ట్రలోని సాంగ్లి జిల్లాలో ఈ ఘటన జరిగింది. శుక్రవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో విజాపూర్-గుహగర్ రహదారిపై జాత్ నగరంలో ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. వీరంతా తీర్థయాత్ర కోసం జాత్ నుంచి విజయపుర్ వెళుతున్నారని వారు వెల్లడించారు. మృతులను మయూరి సావంత్ (38), ఆమె కుమారుడు శ్లోక్(8), తండ్రి నామ్‌దేవ్ (65), తల్లి పద్మిని (60), డ్రైవర్ దత్తా చవాన్ (40) పోలీసులు గుర్తించారు. ప్రమాదం అనంతరం ట్రక్ డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడని వారు వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నట్లు పేర్కొన్నారు.