కంటి చూపు లేకున్నా తాము ఎవరికీ తీసిపోమని చాటుతున్నారు. అద్భుతమైన ప్రతిభ కనబరిచి అందరిని అబ్బురపరుస్తున్నారు. ఇటీవలే ఝార్ఖండ్‌కు చెందిన ఓ అంధ విద్యార్థి మైక్రోసాఫ్ట్‌లో రూ.51 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం సంపాదించాడు. తాజాగా మధ్యప్రదేశ్‌లోని ఇందోర్‌కు చెందిన మరో అంధ విద్యార్థి అదే కంపెనీలో రూ.47 లక్షల వార్షిక వేతనంతో జాబ్ సాధించాడు.
మధ్యప్రదేశ్ ఇందోర్‌కు నగరానికి చెందిన యశ్పాల్.. స్థానికంగా క్యాంటీన్ నడుపుతున్నాడు. ఇతడి పెద్ద కుమారుడే యశ్ సొనాకియా. 8 ఏళ్ల వయసున్నప్పుడే అతడు చూపు కోల్పోయాడు. చూపు సరిగా లేకపోవడం వల్ల ప్రత్యేక పాఠశాలలో చదివేవాడు. తర్వాత సాధారణ స్కూల్లో చేరాడు. అక్కడ యశ్ సోదరి అతడికి సహాయం చేసేది. ప్రత్యేకంగా గణితం, సైన్స్‌లో యశ్ ఆసక్తి కనబరిచేవాడు. ఇందోర్‌లోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో 2021లో బీటెక్ పూర్తి చేశాడు. అనంతరం కోడింగ్ నేర్చుకుని వివిధ కంపెనీలకు ఉద్యోగం కోసం అప్లికేషన్లు పెట్టుకున్నాడు. అందులో భాగంగా మైక్రోసాఫ్ట్ కంపెనీకి కూడా అప్లై చేశాడు. రాత పరీక్ష, ఇంటర్వ్యూలలో అద్భుత ప్రతిభ కనబరిచి, మైక్రోసాఫ్ట్ నుంచి 47 లక్షల ప్యాకేజీతో కొలువు సాధించాడు.
త్వరలోనే బెంగుళూరులోని మైక్రోసాఫ్ట్ కార్యాలయంలో చేరబోతున్నానని యశ్ తెలిపాడు. మొదట్లో వర్క్ ఫ్రం హోం చేయమని యాజమాన్యం తెలిపినా, బెంగుళూరు వెళ్లడానికే ఆసక్తి చూపించానని పేర్కొన్నాడు. "ఇంజినీరింగ్ అయిపోయాక స్క్రీన్ రీడర్ సాఫ్ట్‌వేర్ సహాయంతో ఉద్యోగ ప్రయత్నాలు మొదలు పెట్టాను. కోడింగ్ నేర్చుకున్న తర్వాత మైక్రోసాఫ్ట్‌కు అప్లై చేసుకున్నాను. పరీక్ష, ఇంటర్వ్యూ అనంతరం సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం వచ్చింది" అని యశ్ చెప్పుకొచ్చాడు.
"నా కుమారుడు యశ్ సొనాకియాకు చిన్నప్పుడే గ్లకోమా అనే వ్యాధి వచ్చింది. దాని కారణంగా చూపు మందగించింది. యశ్.. తనకు 8 ఏళ్లు వచ్చేసరికి పూర్తిగా చూపు కోల్పోయాడు. కానీ అతడిని సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ చేయడంలో మేము వెనకడుగు వేయలేదు. ఎట్టకేలకు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కావాలనే అతడి కల నెరవేరింది.అందుకు చాలా సంతోషంగా ఉంది" అని యశ్ తండ్రి యశ్ పాల్ తెలిపారు.
ఇవీ చదవండి: వరదతో మునిగిపోయిన బస్టాండ్.. తెప్పల్లో జనం ప్రయాణం
అక్కడ రోజుకు ఇద్దరు బాలికలపై అఘాయిత్యాలు.. దేశంలో రోజూ 82 హత్యలు