Madhya Pradesh Road Accident : మధ్యప్రదేశ్‌లోని ఉమారియా జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మరణించారు. వేగంగా వెళ్తున్న కారు చెట్టును ఢీకొట్టడం వల్ల సోమవారం జరిగిందీ దుర్ఘటన. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని ఘున్ఘటి పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. చెట్టును కారు ఢీకొట్టడం వల్ల ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు.. మరో ఇద్దరిని ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయారు. అనంతరం ఐదుగురి మృతదేహాలను శవపరీక్షల కోసం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
మృతులంతా ప్రభుత్వ ఉద్యోగులేనని తెలుస్తోంది. వారంతా ఓ పుట్టినరోజు వేడుకకు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం. ప్రమాదం అనంతరం కారు నుజ్జునుజ్జైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నామని పోలీసులు తెలిపారు. పూర్తి దర్యాప్తు చేపడుతున్నామని వెల్లడించారు.
వలసకూలీలపైకి దూసుకెళ్లిన కారు..
Maharashtra Car Accident : మహారాష్ట్రలోని పుణె జిల్లాలో ఐదుగురు వలస కూలీలపైకి కారు దూసుకెళ్లిన ఘటనలో ఇద్దరు మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మృతులను జగదీశ్ మహేంద్ర సింగ్ దావర్, సుర్మల్ మంజారే, దినేశ్ తరోలేగా గుర్తించారు.
పోలీసులు ఇచ్చిన సమాచారం ప్రకారం.. జిల్లాలోని కల్యాణ్ నగర్ జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో జరిగింది. మధ్యప్రదేశ్‌కు చెందిన ఐదు రైతు కుటుంబాలు.. డిగోర్ ప్రాంతానికి వలస వచ్చాయి. స్థానికంగా ఓ రైతు వద్ద కౌలు రైతులుగా ఐదుగురు కూడా పనిలో చేరారు. ఆదివారం రాత్రి పనులు ముగించుకుని ఇళ్లకు వెళ్తున్నారు. అదే సమయంలో కల్యాణ్ నగర్ నుంచి ఓటూరు వెళ్తున్న కారు వారిపైకి దూసుకెళ్లింది.
ఈ ప్రమాదంలో ఇద్దరు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం అనంతరం నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఘటనపై సమాచారం అందుకున్న ఆలెఫాటా పోలీసులు.. అక్కడికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం అలెఫాటాలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కొన్ని గంటల తర్వాత పోలీసులు.. కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.