Lokesh Fire on YCP Government About Chandrababu Arrest: జగన్ రెడ్డి వ్యవస్థలను మేనేజ్ చేసి చంద్రబాబును రిమాండ్‌కు పంపించారని.. తాము న్యాయాన్ని నమ్ముకుని జనంలోకి వెళ్తామని నారా లోకేశ్ అన్నారు. అరెస్టుకు వ్యతిరేకంగా 28రోజులుగా శాంతియుతంగా కొనసాగుతున్న పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని తెలిపారు. చంద్రబాబుకు జరిగిన అన్యాయం ప్రతి ఒక్కరికీ తెలిసేలా గడప గడపకు 'బాబుతో నేను' కార్యక్రమాన్ని చేపడతాం అని లోకేశ్ వెల్లడించారు. బాబు ఆరోగ్యంపై మీడియా ప్రశ్నలకు స్పందించిన లోకేశ్.. చంద్రబాబు ఉక్కులాంటి మనిషి అని చెప్తూ.. జైలులో భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరం జైలులో చంద్రబాబుతో ములాఖత్ అనంతరం భువనేశ్వరి, బ్రాహ్మణితో కలిసి లోకేశ్ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. రాష్ట్రంలో దొంగ కేసుల విషయమై రాష్ట్రపతికి వివరించామని, రాష్ట్రంలో రాజ్యాంగ ఉల్లంఘనలపై రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లామని వివరించారు
CBN Bail Petition చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై తీర్పు సోమవారానికి వాయిదా
జనసేనతో కలిసి సంయుక్త కార్యాచరణ కమిటీ: చంద్రబాబుకు జరిగిన అన్యాయాన్ని గడపగడపకు వివరిస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్(Nara Lokesh) తెలిపారు. జనసేనతో కలిసి సంయుక్త కార్యాచరణ కమిటీ ఏర్పాటు (Janasena-TDP Committee) చేస్తామని, కమిటీ సూచనలతో ముందుకు వెళ్తామని వెల్లడించారు. టీడీపీ పోరాటం ఆగలేదని, రాష్ట్ర వ్యాప్తంగా 175 స్థానాల్లో నిరసన చేపడతామని లోకేశ్ స్పష్టం చేశారు. గడప గడపకు 'బాబుతో నేను' కార్యక్రమాన్ని చేపట్టి.. చంద్రబాబుకు జరిగిన అన్యాయాన్ని గడపగడపకు వివరిస్తామని తెలిపారు. పాదయాత్ర, ఇతర కార్యక్రమాలపై చర్చించి నిర్ణయిస్తామని చెప్పారు.
చంద్రబాబు భద్రతపై లోకేశ్ ఆందోళన వ్యక్తం చేశారు. మావోయిస్టులు, గంజాయి కేసు నిందితులు ఇదే జైలులో ఉంటున్నారని గుర్తు చేశారు. జైలు లోపల కొందరు డ్రోన్ ఆపరేట్ చేశారని, జైలుపై దాడి చేస్తామని కొందరు.. నేరుగా ఎస్పీకి లేఖ రాశారని గుర్తు చేస్తూ చంద్రబాబుకు తగిన భద్రత లేదని చెప్పారు. ఇక.. పోలీసు వ్యవస్థను వాడుకుని ప్రతిపక్షాలను వేధిస్తున్నారన్న లోకేశ్.. తప్పుడు కేసులు పెట్టిన అధికారులపై విచారణ చేయిస్తామని, చట్టాలు ఉల్లంఘించిన అధికారులపై విచారణ చేసి సర్వీసు నుంచి తప్పిస్తామని హెచ్చరించారు. పోలీసులు అంబేడ్కర్ రాజ్యాంగాన్ని అమలు చేయాలని కోరుతున్నానని అన్నారు.
దీక్షలు కొనసాగింపు: 28 రోజులుగా రిమాండ్‌లో ఉంచినా చంద్రబాబు అధైర్యపడలేదని లోకేశ్ వెల్లడించారు. పోరాటం ఆపవద్దు.. శాంతియుతంగా పోరాడాలని తనతో చెప్పారని తెలిపారు. న్యాయం ఆలస్యం అవుతుందేమో గానీ, చివరికి తమదే విజయమని ధీమా వ్యక్తం చేశారు. న్యాయపోరాటం కొనసాగిస్తున్నామని, అందులో భాగంగానే దీక్షలు కొనసాగిస్తామని తెలిపారు. చంద్రబాబుకు మద్దతుగా సంఘీభావం తెలపాలన్న లోకేశ్.. శనివారం రాత్రి 7 గంటల నుంచి 5నిమిషాల పాటు ఇళ్లలో లైట్లు ఆఫ్ చేయాలని కోరారు. కొవ్వొత్తులు వెలిగించి, మొబైల్ ఫ్లాష్‌లైట్లతో సంఘీభావం తెలపాలని సూచించారు.
తన దిల్లీ పర్యటనపై లోకేశ్ మాట్లాడుతూ.. రాష్ట్రపతిని కలిసి రాష్ట్రంలో పరిస్థితులు వివరించామని తెలిపారు. ఇతర పార్టీల ఫ్లోర్ లీడర్లను కలిసి పరిస్థితి వివరించామని... చంద్రబాబు తప్పు చేసే వ్యక్తి కాదని ఇతర పార్టీల నేతలు తనతో అన్నారని వెల్లడించారు. కక్ష సాధింపు ధోరణి వల్ల.. రాష్ట్రానికి రావాల్సిన పరిశ్రమలెన్నో పక్క రాష్ట్రానికి వెళ్తున్నాయని అన్నారు. కుటుంబం మొత్తాన్ని ప్రభుత్వం రోడ్డుపైకి తెచ్చింది... అయినా, మేము నమ్ముకున్న సిద్ధాంతాల కోసం పోరాడుతామన్న లోకేశ్.. చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకు వస్తారని అన్నారు. ప్రభుత్వ తప్పులు బయటపెట్టి.. ప్రజల తరఫున పోరాడుతున్నందుకు దొంగ కేసు పెట్టి చంద్రబాబును 28 రోజులుగా రిమాండ్‌లో పెట్టారని లోకేశ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
'పోలవరంపై మాట్లాడితే చంద్రబాబును రిమాండ్‌కు పంపారు.. స్కిల్ కేసులో తొలుత రూ.3 వేల కోట్ల అవినీతి అని చెప్పారు.. అనంతరం రూ.300 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు.. మళ్లీ ఇటీవల రూ.27 కోట్ల అవినీతి అని మాట మార్చారు.. కక్ష సాధింపుతో వ్యవస్థలను మేనేజ్ చేసి చంద్రబాబును రిమాండ్‌కు పంపారు... రిమాండ్‌కు పంపినా కేసులు పెడుతున్నారు' అని లోకేశ్ వైసీపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. న్యాయం ఆలస్యం కావచ్చేమో కానీ మావైపే ఉంటుందని, చంద్రబాబు ఏనాడూ తప్పు చేయరని స్పష్టం చేశారు.