Loksabha Adjourned: భారత్- చైనా సరిహద్దు సమస్యపై చర్చ జరపాలని విపక్షాలు పట్టుబట్టడం వల్ల లోక్‌సభ గురువారం రెండోసారి వాయిదా పడింది. మధ్యాహ్నం రెండు గంటల వరకు సభను వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు.
సభ ప్రారంభమైనప్పటి నుంచి విపక్షాలు నినాదాలు చేయడం వల్ల స్పీకర్ తొలుత.. మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. ఆ తర్వాత సభ మళ్లీ ప్రారంభమైనా.. ప్రతిపక్ష నాయకులు చర్చ జరపాల్సిందేనని పట్టుబట్టారు. దీంతో స్పీకర్ మరోసారి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి విపక్షాలను ఉద్దేశించి సభలో మాట్లాడారు. శీతాకాల సమావేశాలు శుక్రవారంతో ముగుస్తాయని.. కాబట్టి సభ సజావుగా సాగేందుకు సహకరించాలని ఆయన కోరారు. గతంలో యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి అంశాలపై చర్చకు ఎప్పుడూ అనుమతి ఇవ్వలేదని, అప్పుడు తాము అంగీకరించామని తెలిపారు.
రాజ్యసభను బహిష్కరించిన విపక్షాలు..
రాజ్యసభలో చైనాతో సరిహద్దు సమస్యపై చర్చకు నిరాకరించినందుకు కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షాలన్నీ గురువారం సభను బహిష్కరించాయి. "మేము శీతాకాల సమావేశాలు ప్రారంభమైన మొదటి రోజు నుంచి చైనాతో సరిహద్దు వివాదంపై చర్చకు డిమాండ్ చేస్తున్నాము. కానీ ప్రభుత్వం మొండి వైఖరి కనబరుస్తోంది. అందుకే ప్రతిపక్షాలన్నీ సభను బహిష్కరించాలని నిర్ణయించుకున్నాయి" అని కాంగ్రెస్ నాయకుడు కేసీ వేణుగోపాల్ మీడియాకు తెలిపారు.
'అందరూ మాస్క్ ధరించండి'
దేశంలో కొవిడ్ కొత్త వేరియంట్ వెలుగుచూసిన నేపథ్యంలో ఎంపీలందరూ మాస్క్‌లు ధరించాలని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కోరారు. ఆయన కూడా మాస్క్ ధరించి సభకు వచ్చారు. పలుదేశాల్లో కొవిడ్ కేసులు భారీగా పెరుగుతున్నాయని తెలిపారు. కొవిడ్ ప్రొటోకాల్‌ను పాటించాలన్నారు. లోక్‌సభ ఛాంబర్‌లోని ఎంట్రీ పాయింట్ల వద్ద మాస్క్‌లు అందుబాటులో ఉంచామని చెప్పారు. రాజ్యసభ ఛైర్మన్, ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖడ్ కూడా ఎంపీలంతా మాస్క్ ధరించాలని కోరారు.