దేశ రాజధానిలో రైతుల నిరసనలు... గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన వార్త ఇది. కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తీవ్రమైన చలిలోనూ ఆందోళనలు చేస్తున్నారు అన్నదాతలు. కేంద్రం దిగొస్తే కానీ తమ నిరసనలు విరమించుకోమని తేల్చిచెబుతున్నారు. అయితే రైతుల ఆందోళనలు.. కేవలం వ్యవసాయ చట్టాలకే పరిమితం కాలేదు. అనేక డిమాండ్లతో వారు దేశ రాజధాని సరిహద్దుల్లో బైఠాయించారు. ఈ జాబితాలో 5 డిమాండ్లు మాత్రం కీలకంగా ఉన్నాయి.
- డిమాండ్ 1:-
నూతన వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి.
ప్రభుత్వం మాట-
మూడు నూతన వ్యవసాయ చట్టాలను అక్టోబర్లో అమల్లోకి తెచ్చింది ప్రభుత్వం. అవి.. రైతు ఉత్పత్తుల వాణిజ్య, వ్యాపార (ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్) చట్టం-2020, రైతుల సాధికారత, రక్షణ, వ్యవసాయ సేవల చట్టం- 2020, నిత్యావసరాల చట్ట సవరణ-2020.
వీటి ద్వారా రైతులు తమ ఉత్పత్తులను ప్రభుత్వామోదిత ఏపీఎంసీ మార్కెట్ వెలుపల విక్రయించుకోవడానికి అవకాశం లభించింది. అన్నదాతలు నేరుగా వ్యవసాయ వాణిజ్య సంస్థలు, టోకు వ్యాపారులు, ఎగుమతిదారులు, పెద్ద రిటైలర్లతో ఒప్పందం కుదుర్చుకోవచ్చు. మూడో చట్టం ద్వారా.. తృణధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెలు వంటి ఉత్పత్తులను నిత్యావసర వస్తువల జాబితా నుంచి తొలగించింది కేంద్రం.
రైతుల వాదనేంటి?
ప్రైవేటు వ్యాపారులకు తప్ప తమకు ఈ కొత్త చట్టాలతో ఎలాంటి లాభం లేదని రైతు సంఘాలు తేల్చిచెబుతున్నాయి.
ఇదీ చూడండి:- సాగు చట్టాల గురించి సగం మంది రైతులకు తెలీదు!
- డిమాండ్ 2:-
పంటలకు కనీస మద్దతు ధర కల్పించాలి.
రైతుల వాదనేంటి?
చట్టాల్లో కనీస మద్దతు ధర గురించి ఎక్కడా లేదని రైతు సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. కనీస మద్దతు ధరపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ కావాలని పట్టుబడుతున్నాయి.
ప్రభుత్వం మాట-
కనీస మద్దతు ధరను కొనసాగిస్తామని కేంద్రం చెబుతోంది. ఇందుకు సంబంధించి గోధుమ, వరి పంటలకు తాము ఇచ్చిన కనీస మద్దతు ధరలను ఉదాహరణగా చూపిస్తోంది.
- డిమాండ్ 3:-
స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల మేరకు కనీస మద్దతు ధరను అమలు చేయాలి.
- డిమాండ్ 4:-
ప్రభుత్వం చేపట్టిన విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలి.
బిల్లులో ఏముంది?
విద్యుత్ పంపిణీ వ్యవస్థను ప్రైవేటీకరణ చేయడం.
రైతుల వాదనేంటి?
ఈ చట్ట సవరణతో తమకు ఉచిత విద్యుత్ లభించదని రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
- డిమాండ్ 5:-
వ్యవసాయ వ్యర్థాల దహనంపై ఉన్న జరిమానా, జైలు శిక్షను రద్దు చేయాలి.
రైతుల వాదనేంటి?
వ్యర్థాల దహనంపై ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ. కోటి వరకు జరిమానా విధించడం సరికాదని రైతు సంఘాలు చెబుతున్నాయి. ఇప్పటికే మోపిన కేసులను కూడా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.
ఇవీ చూడండి:- చర్చకు కేంద్రం రెడీ- మరి రైతులు భేటీకి వస్తారా?