Lepakshi Knowledge Hub Famers Problems: లేపాక్షి నాలెడ్జి హబ్ కోసం ఇప్పటి సత్యసాయి జిల్లా చిలమత్తూరు, గోరంట్ల మండలాల పరిధిలో... 6 వేల 313 ఎకరాల అసైన్డ్ భూములను Y.S. ప్రభుత్వం సేకరించింది. అందులో 5వేల 811.16 ఎకరాలను నాలెడ్జ్ హబ్‌కు అప్పగించింది. మరో 3వేల 32 ఎకరాల ప్రభుత్వ భూములనూ వారికి కట్టబెట్టింది. ప్రభుత్వాన్ని నమ్మి అసైన్డ్ భూములిచ్చిన దళితులు, గిరిజనులు, ఇతర బడుగువర్గాల వారికి.. ఎకరా మెట్ట భూమికి లక్షా 75 వేలు, నీటి ఆసరా ఉంటే 2లక్షలు ఇచ్చి చేతులు దులిపేసుకుంది. ప్రభుత్వ భూమైతే 50 వేలతో సరిపెట్టింది. మొత్తంగా భూమి ధర, ఇతర రుసుములు కలిపి 8వేల 844 ఎకరాల భూమిని.. కేవలం 119.85 కోట్లకే లేపాక్షికి కట్టబెట్టింది. అంటే.. ఒక్కో ఎకరా సగటున లక్షా 35 వేల అతి తక్కువ ధరకే అప్పజెప్పింది. ఆ భూముల్లో పరిశ్రమల స్థాపన కోసం ఎలాంటి ప్రయత్నం చేయకుండానే మూడేళ్లు కాలక్షేపం చేసిన లేపాక్షి.. ఆరున్నర రెట్లకు పైగా అధిక ధరకు ఎకరా 9 లక్షల చొప్పున అమ్ముకోవడానికి అప్పట్లోనే సిద్ధమైంది. దీన్నిబట్టే ఇది ఎంత దగా ప్రాజెక్టో అర్థమవుతుంది.
ప్రతి కుటుంబానికి ఉద్యోగం ఇస్తామంటూ ప్రభుత్వంతో కలిసి మభ్యపెట్టిన లేపాక్షి.. ఆ మాటే మరిచిపోయింది. భూములు కోల్పోయి ఉపాధి కరవైన ఈ ప్రాంత యువత.. చిన్నాచితకా పనుల కోసం వలస పోయింది. ప్రస్తుతం ఈడీ అధీనంలో ఉన్న లేపాక్షి భూములను సాగు చేసే అవకాశం లేక, పరిశ్రమలూ ఏర్పాటు చేయక బీడువారిపోయాయి. అయితే.. బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి 65 కిలోమీటర్లు, ప్రతిష్టాత్మక కియా కార్ల కంపెనీకి కేవలం 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ భూముల ధరలకు.. ఇప్పుడు రెక్కలొచ్చాయి. ఒకప్పుడు లక్ష నుంచి 2 లక్షల లోపు ధరకే సేకరించిన భూములు.. కనీసంగా 50 లక్షల నుంచి కోటి 30 లక్షల వరకూ పలుకుతున్నాయి. కళ్లముందే ఈ మార్పులన్నీ బడుగు రైతులు.. అప్పట్లో అతి తక్కువ ధరకే భూములు లాగేసుకున్నారని తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు.
నాలెడ్జ్‌కు భూములిచ్చిన వారిలో ఒక్కొక్కరిది ఒక్కో దీనగాథ. అరకొర పరిహారమే అందిందని ఆవేదన చెందేవారు కొందరైతే.. అసలు రూపాయి కూడా ఇవ్వలేదని వాపోతున్న వారు మరికొందరు. వచ్చిన లక్షో, రెండు లక్షలో అప్పట్లోనే ఖర్చయిపోయి.. ఇప్పుడు కూలికిపోతే తప్ప పూటగడవడం లేదని కనిశెట్టిపల్లి రైతులు వాపోతున్నారు.
"లేపాక్షి హబ్ కింద మాది ఆరెకరాల పొలం పోయింది. మా భూమిపై బంధువులు కొందరు కోర్టుకు వెళ్లడంతో మొదట్లో పరిహారం ఇవ్వలేదు. ఆరేళ్ల కిందట కోర్టులో మాకు అనుకూలంగా తీర్పు వచ్చింది. అప్పటి నుంచి పరిహారం కోసం తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. తాడేపల్లిలో సీఎం ఇంటికి వెళ్లి వినతి పత్రం ఇచ్చినా ఫలితం లేదు. కూలీ చేసుకుని బతుకుతున్నాం. ఒక్కోసారి ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తోంది. మా పొలాల ధర ఇప్పుడు ఎకరా 50లక్షల రూపాయలు"-శివప్ప, కనిశెట్టిపల్లి
జగన్ వెనుకుండి నడిపించిన లేపాక్షి బాగోతం తమను సర్వనాశనం చేసిందని.. నల్లరాళ్లపల్లి రైతులు కంటతడి పెడుతున్నారు. ఇప్పుడు ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నా ఏవిధమైన న్యాయం చేయడం లేదని ఆక్రోశిస్తున్నారు.
ఫ్యాక్టరీలు కట్టిస్తామని, ఇంటికో ఉద్యోగం ఇస్తామని మా భూములు లాక్కున్నారు. ఇప్పుడు మా బిడ్డలు కూలీ చేసుకుని బతకాల్సి వస్తోంది. లేపాక్షి వల్ల జనాలు సర్వనాశమయ్యారు. మా కుటుంబానివి నాలుగెకరాలు. ఎకరా1.75లక్షల చొప్పు తీసుకున్నారు. ఆ డబ్బంతా ఇతర అవసరాలకు ఖర్చు అయిపోయింది. ఇప్పుడు మా భూములున్న చోట ఎకరం కోటి పలుకుతోంది. జగన్ పుణ్యాన సర్వనాశనమయ్యాం. ఏదైనా తాగి చచ్చిపోయే స్థితికి వచ్చాం.ప్రమాణం చేసి చెబుతున్నాను. జగన్ పదవి పోవాలని మొక్కుకుంటున్నాం. - నారాయణప్ప, నల్లరాళ్లపల్లి
ఇందిరా గాంధీ తమకు భూములిస్తే రాజశేఖరరెడ్డి లాక్కున్నారని... దిగువపల్లి తాండా ప్రజలు ఉద్వేగానికి లోనవుతున్నారు. చుట్టుపక్కల భూములు కోట్లు పలుకుతుంటే... తమకీ ఖర్మ ఎందుకు పట్టిందా అని ఏడవని రోజు లేదని చెమ్మగిల్లిన కళ్లతో చెబుతున్నారు. ఉన్న భూములు లేపాక్షికి ఇచ్చి చెట్టుకొకరు, పుట్టుకొకరం అయ్యామని.. ఆంజనేయతాండా వాసులు గద్గద స్వరంతో చెబుతున్నారు. లేపాక్షి నాలెడ్జ్ హబ్ భూసేకరణ గ్రామాల్లో ఎవరిని కదిలించినా ఇదే దైన్యం. దారుణంగా మోసపోయామన్న భావనతో కుమిలిపోతున్న బాధితులను ఇప్పుడు ఓదార్చేదేవరు..?